Rasthaa Magazine, March 2019.
మార్చి 2018
ఆదివారం రాత్రి
ఈ హోటలొద్దని సుందరం బావ మొదట్నించీ చెబుతూనే ఉన్నాడు. సిబ్బంది కస్టమర్లని పీడిస్తారని అక్కడక్కడ విన్నవన్నీ చెప్పాడు. శ్రద్ధగా విన్నాను కానీ పట్టించుకోలేదు. నిజానికి అమ్మాయి నిశ్చితార్థం తుంగపాడులోనే చేసేవాడిని. ఫంక్షను రాజమండ్రిలో చెయ్యాలని జయ పట్టుబట్టింది. డబ్బు దుబారా చేయడం నచ్చకపోయినా ఒక్కగానొక్క సంతానమని పెద్దగా పేచీ పెట్టలేదు. హాలు కుదుర్చుకుంటుంటే మానేజర్ పళ్ల రసం తెప్పించాడు, పూర్తి పేమెంటు ఇవ్వబోతుంటే అడ్వాన్సు తప్ప పైసా పుచ్చుకోలేదు. బయటకి నడుస్తూ బావకి వయసుకంటే వేగంగా భయాలు పెరుగుతున్నాయని నవ్వుకున్నాను. ఇప్పుడిలా జరుగుతుందని ఏ మాత్రం ఊహించలేదు.
***
ఇంటి పెద్దంటే నిటారుగా నిలబడాలి, అలుపు చూపకుండా అజమాయిషీ చెయ్యాలని నమ్ముతాను. లోపలెంత చెమట పడుతున్నా ధీమాగా కనిపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఇక ఏ తగువు వద్దనుకుంటే ఇదొచ్చి పడింది. పాపం విషయం తెలియగానే సుందరం బావ, బాచిగాడు ఆదరబాదర బయటికెళ్లారు. గోడ గడియారం ముల్లు భారంగా తిరుగుతోంది. చివరి వరుసలో ముసలావిడ ఆపకుండా దగ్గుతోంది. జయ మంటపం పక్కన సన్నటి కవర్లు, రంగు డబ్బాలు సంచీలో సర్దుతుంటే పిల్లలు చుట్టూ చేరి గోల చేస్తున్నారు.
కాస్త కనిపెట్టుకుని ఉండమంటే దొరబాబు సెల్లు చెవికి వ్రేలాడేసుకుని గుమ్మం దగ్గర తచ్చాడుతున్నాడు. నా అపనమ్మకం నాది. పనులు చూసుకుంటూ వాడినో కంట కనిపెడుతూనే ఉన్నాను. తొమ్మిదవుతుంటే ఈదురుగాలిలా హాల్లోకి వచ్చాడు బాచిగాడు, ప్రాణం లేచొచ్చింది. నన్ను చూసి “బాబయ్యా...” అని అరుస్తుంటే దొరబాబు అడ్డం పడ్డాడు. దగ్గరకి తీసుకొచ్చి, “పెళ్లోరింకా ఎల్లలేదురా బాబూ! చెప్పేదేదో ఎవరూ ఇనకుండా చెప్పు,” అని గుసగుసగా చెప్పాడు.
బాచిగాడు చుట్టూ చూసుకుని, “మరేమో, బాబయ్యా! పదారు వేలు మించి దొరకలేదు.” అని నట్టుకుంటూ చెప్పాడు. ఊరంతా వాడిదే కనీసం సగం తెస్తాడని ఆశ పడ్డాను. ఇంకా అరవై రెండు వేలు కావాలి, కుర్చీలో కూలబడిపోయాను. బాచిగాడు పక్కనే కూర్చుని ఎంతలా తిరిగాడో, ఎవరెవరిని కలిసాడో చెబుతుంటే వింటున్నట్టు చూస్తున్నాను.
దొరబాబు ఇప్పుడే వస్తానని వెళ్లినవాడు కాస్తా కంగారుగా లోపలకొచ్చాడు, “మామయ్యా, బ్యాంకు రామం ఫోన్జేసాడు. హైవే మీద బళ్లన్నీ ఆగిపోయాయిట, లేటవుద్దని చెప్పమన్నాడు...” అన్నాడు.
ఏం చెప్పాడో వెంటనే అర్థం కాలేదు. అసలు రామం రావడమేమిటి?...నేను వాడిని ఫంక్షను కి పిలవలేదు. ఇప్పుడు ఎందుకు ఊడిపడుతున్నాడో అడిగి తెలుసుకునే ఓపిక లేక ఓ చూపు చూసి ఊరుకున్నాను. దొరబాబు అక్కడితో సరి పెడితే బావుండేది. ఆ ముక్క చెప్పి జాలిగా చూసాడు, చిర్రెత్తుకొచ్చి లేచి నిలబడ్డాను.
“నువ్వా దిక్కుమాలిన ఫోను పక్కనెట్టి మేనేజర్ తో మాట్లాడరా బాబూ ...” అని ఇంచుమించు అరిచినంత పని చేసాను.
వాడు దగ్గరకొచ్చి “ఎందుకు మాట్లాడలేదు? మాది పక్కూరే, తెల్లారగానే తెచ్చిస్తామని చెప్పాను. ఆడేవన్నాడో తెలుసా?” అని పౌరుషంగా అడిగాడు.
“అలా మీదడిపోకూడదు. ఏ బ్యాంకు కార్డో, చెక్కో, వేరే ఏదో స్యూరిటీ గా ఉంచుకోమని చెప్పలేపోయావా?”
“ఎదవని నిదానంగానే అడిగాను. మా పాలసీ ఒప్పుకోదండి. అసలే తెల్లారితే బుకింగ్ ఉంది. తమరు పదిన్నర లోపు క్యాషిచ్చి ఖాళీ చేస్తే, మేము శుభ్రం చేసుకుంటామని మహా టెంపర్గా అన్నాడు. లాగి గూబ మీద ఇద్దామనుకున్నాను..” అని ఊగిపోయాడు.
భుజం మీద చెయ్యేసి “ఒరే కొట్టకుండా మంచిపని చేసావు. పెళ్లోరి ముందు గొడవలొద్దు.” అంటే కాస్త తగ్గాడు.
బాచిగాడు క్రాఫు సరిచేసుకుంటూ “లెక్క చెప్పాలి కాబట్టి బుకింగపుడు పూర్తి పేమెంట్ తీసుకోరు. తర్వాత ప్రొప్రయిటర్ కి తెలియకుండా నొక్కేస్తారు.” అని చెబుతుంటే బాచిగాడు మెచ్చుకోలుగా తలూపాడు. సుందరం బావ సరిగ్గా ఇలానే చెప్పాడు. అయినా ఇప్పుడు తలుచుకుని ఏం లాభం?
మేము మాటల్లో ఉండగా వియ్యంకుడి తమ్ముడు నవ్వుతూ దగ్గరకొచ్చాడు. మాటల్లో వియ్యంకుడి కోపం ఇంకా తగ్గలేదని తెలిసింది. కాసేపు మాట్లాడి కాఫీ పంపమని చెప్పి వెళ్లిపోయాడు.
ఆయన వెళ్లిన వైపు చూస్తూ నిలబడ్డాను.
జయ ఒప్పుకున్నా లేకపోయినా నేను కక్కుర్తి మనిషిని కాదు. నేను పద్దతైన మనిషిని. నానా గడ్డి కరిచి సరిపడ డబ్బు తెచ్చుకున్నాను. కార్యక్రమం మొదలైన కాసేపటికి ముందు మాటల ప్రకారం ఏర్పాట్లు చెయ్యలేదని వియ్యంకుడు అలిగి కూర్చున్నాడు. నేనూ సుందరం బావ పొరపాట్లు సవరిస్తామని బతిమాలి రాజీ కుదిర్చాము. అదనపు ఏర్పాట్లు ఉచితంగా రావు కదా? తెచ్చుకున్న డబ్బు చాలా మటుకు ఖర్చయ్యింది.
ఎన్ని సార్లు చేసినా సుందరం బావ ఫోన్ ఎత్తట్లేదు. నాకు గుండె దడగా ఉంది. రానురాను హాలు గోలగా మారిపోతోంది. పిల్లలు చెలరేగిపోతున్నారు. సుందరం బావ మనవడు, ఏడేళ్ల వాసుగాడు పరిగెత్తుకొచ్చి “తాతయ్యా, గిఫ్టూ!” అంటూ కవర్ చేతిలో పెట్టాడు. ఏదో ధ్యాసలో ఉండి పట్టించుకోకపోతే “తీసి చూడు, తీసి చూడు...” అని కోతిలా గెంతుతున్నాడు. ఇక అరుపులు భరించలేక విప్పి చూస్తే తెల్ల కాగితంపై ‘ఫైవ్ హండ్రెడ్ రూపీస్’ అని ఉంది. వాడి చేష్టకి చుట్టూ మూగిన పిల్లలు చప్పట్లు కొట్టి సంతోషపడ్డారు.
దొరబాబు వాచీ చూసుకుని అరగంటలో పనివాళ్లు హాల్లోకి రావొచ్చన్నాడు.
****
ముందు వరుసలో కాఫీలు అందిస్తుంటే సంభాషణ జోరుగా సాగుతోంది. వియ్యంకుడి తమ్ముడు చనువుగా బలవంతపెడితే కూర్చోక తప్పలేదు.
“రావు గారూ, మన గాంధీపార్కు దగ్గర బ్యాంకు ఉంది కదండీ. అక్కడో ఇరవై ఏళ్లుగా మన ఖాతా ఉందండి. మీరు చెబితే నమ్మరండి, నాలుగైదు వారాలుగా పది వేల చెక్కిచ్చినా స్టాఫ్ బెంబేలు పడిపోతున్నారండి. మొన్నయితే, చెబితే నవ్వుతారు (నవ్వుతూ.)...బాగా పరిచయమున్న పాత క్యాషియర్ పక్కకి లాక్కెళ్లి రెండు వేలు మించి ఇవ్వలేమండి, కాస్త అమౌంట్ మార్చి ఇవ్వండని బతిమాలాడండి...”
“అసలు బ్యాంకంటే ఏమిటండీ? ఓ భరోసా, ఓ ఆసరా...ఈ ప్రభుత్వం వచ్చాకా బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. పాపం రిటైరైనవారంతా ఏమవుతారో?...”
“అంకుల్, మీలాంటి సీనియర్స్ అలా మాట్లాడకూడదు. ఈ కన్ఫ్యూస్ చేసే కమ్యూనిస్ట్ చానళ్లు చెప్పేది నమ్మకుండా కాస్త ఓపెన్ గా ఆలోచించండి. మన దేశంలో టాక్స్ పేయర్స్ చాలా తక్కువ, మనమూ ఓ డెవలప్డ్ కంట్రీ గా, ఓ ఫార్మల్ ఎకానమీ గా మారాలంటే ఇలాంటి ఓవర్ హాల్ తప్పదు. ప్రజలకి షార్ట్ టర్మ్ లో చిన్నచిన్న ఇబ్బందులున్నా ఫ్యూచర్ లో వీటి బెనిఫిట్స్ తెలుస్తాయి.”
“ప్రయోజనాలు ఎప్పుడో కాదండి, వెంటనే కనిపిస్తున్నాయి. అప్పు తీసుకున్న వారు దేశమొదిలి పారిపోతున్నారు,” అనగానే అంతా ఘొల్లుమని నవ్వారు.
అంతా నవ్వడంతో ముందు మాట్లాడిన కుర్రాడు చిన్నబుచ్చుకున్నాడు. ఇంటాబయటా ఇవే చర్చలు. మాటలు కలుపుదామంటే వియ్యంకుడు అవకాశం ఇవ్వకుండా మిగతావారితో వాదిస్తున్నాడు. విషయం ఎలా కదపాలో తెలియక సతమతమవుతుంటే గుమ్మం దగ్గర సుందరం బావ కనిపించాడు. లేచి హుటాహుటిన ఎదురెళ్లాను.
****
ఇద్దరం హాలు బయటకి వెళ్లాము.
బావ ఒగుర్పు కాసేపటికి తగ్గింది. పాపం పెద్దాయనని శ్రమ పెట్టాను.
“జైను పది చోట్ల తిప్పి పద్దెనిమిది వేలు ఇచ్చాడు. మన మూర్తి ఎలా సంపాదించాడో తెలీదు, దారిలో పన్నెండు వేలు తెచ్చిచ్చాడు. ఫోన్లు చేసిచేసీ గొంతెండిపోయింద్రా బాబు! కనీసం సోడా నీళ్లు తాగలేదు, ” దొరబాబుని నీళ్లు తెమ్మని సైగ చేసాను.
బావ సెల్లు చూపించి “నీకు పరిస్థితి చెబుదామంటే బాటరీ చచ్చి కూర్చుంది. మనకీ పెంట గోల ఆదివారమే వచ్చిపడింది, బ్యాంకులు తెరిచుంటే ఏదోకటి చేసేవాడిని...” అని చుట్టిన పేపరు విప్పి నోట్లు తీసాడు.
దొరబాబు నీళ్ల బాటిల్ తెస్తుంటే జయ కూడా వచ్చింది.
“ఎంతుందో తెలీదు, మరి తీసి చూడండి.” అని ప్లాస్టిక్ సంచీ చేతిలో పెట్టింది. సంచీలో బహుమతిగా ఇచ్చిన సన్నటి కవర్లు.
నేనూ బావా ఒక్కొక్క కవరు విప్పి నోట్లు బయటకి తీసాము.
ఒకటికి రెండుసార్లు నోటు విడదీసి చూసుకున్నాము.
మిగతా ముగ్గురూ చుట్టూ నిలబడి చూస్తున్నారు.
జీవితంలో ఎన్ని కట్టలిచ్చానో, ఎన్ని కట్టలు తీసుకున్నానో లెక్క లేదు. ఇలా ఆబగా నోట్లు లెక్కెట్టడం సిగ్గుగా ఉంది. జయ ఇచ్చిన సంచీ ఆరున్నర వేలు సంపాదించి పెట్టింది. ఇంకా పాతిక వేలు కావాలి.
***
టైం పదిన్నర. మానేజర్ ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు.
ముందే వెళ్ళి కలుద్దామని రిసెప్షన్ వైపు బయలుదేరాము.
మెట్లు దిగుతుంటే బ్యాంకు రామం ఎదురయ్యాడు.
మనిషి కాస్త ఒళ్లు చేసాడు. ఈ నోట్ల కరువు వచ్చాకా పెద్దవాళ్లంతా ఇంటికి వస్తూంటారని విన్నాను.
నింపాదిగా దగ్గరకొచ్చి “నాకో మాట చెప్పొచ్చు కదండీ! దొరబాబు చెబితే తెలిసింది,’ అని నిష్టూరంగా పలకరించాడు. పర్వాలేదని మాట దాటవేసాను. మాతో కూడా నడుస్తూ, హైవే ట్రాఫిక్ గురించి మాట్లాడాడు. “వచ్చే ముందు కనీసం పది ఫోన్లు చేసానండి, చెబితే నమ్మరు, ఏదో చిల్లర నోట్లు తప్ప ఎక్కడా పెద్ద అమౌంట్ దొరకలేదండి.” అన్నాడు.
నేను నమ్మలేదు. నా లెక్క ప్రకారం రామం ఎవ్వరికీ ఫోను చెయ్యక్కర్లేదు, బ్యాంకువాడు తిన్నగా డబ్బు తెచ్చి ఇవ్వచ్చు.
రామం సుందరం బావకేసి చూస్తూ, “ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మొన్నా మధ్యన కస్టమర్లు తెగ ఇబ్బంది పడుతున్నారండీ అని మేనేజర్ తో అంటే సీలింగ్ ఫ్యాన్ కేసి తీక్షణంగా చూస్తూ అసలీ మార్పులు ఎప్పుడో రావాల్సింది రామం, ఏనుగు కదిలితే గడ్డిపరకలు కాస్త నలుగుతాయి కదా, తప్పదు అన్నాడండి,” అని సన్నగా నవ్వాడు.
వచ్చిన క్షణం నుండి రామాన్ని చూస్తున్నాను, మమ్మల్ని గమనించినట్టు అనిపించలేదు. ఏదో తన ధోరణిలో కబుర్లు చెబుతున్నాడు, కులాసాగా నవ్వుతున్నాడు. అతని పధ్ధతి ఏ మాత్రం నచ్చలేదు. పిలుపు అందలేదని కసి తీర్చుకున్నట్టుగా ఉంది.
అంతా రిసెప్షన్ కి చేరుకున్నాము.
మానేజర్ కూర్చున్నవాడు కాస్తా ఒక్క ఉదుటున లేచి రామాన్ని పలకరించాడు.
రామం నాకేసి చూస్తూ, “మాకు బాగా పాత ఖాతా, ప్రొప్రయిటర్ కి లెక్క రెండు రోజుల్లో తెచ్చిస్తామని చెబుతాను, పర్వాలేదు కదా?” అని సెల్లు బయటకి తీసాడు.
అప్రయత్నంగా రామం భుజంపై చెయ్య వేసి అలాగే చెప్పమని చెప్పాను.
****
No comments:
Post a Comment