Kinige Magazine, August, 2014
కాలనీలో ఇళ్ళు
వరుసగా ఇటుకలు పేర్చినట్టున్నాయి, రోడ్డుకి ఇరుపక్కలా పెరిగిన చెట్లు దారిని గొడుగులా కప్పి వెలుతురుని
తగ్గించేసాయి. మల్లేష్ పాల దుకాణం, రామాలయం దాటుకుంటూ కమ్యూనిటీ హాల్ మైదానం చేరుకోగానే చెట్లని తప్పించుకుని
ఆకాశం ఒక్కసారిగా తెరుచుకుంది. మాములుగా రోడ్లపై కనిపించే ఆటల సందడి జనవరి నెల
రావడంతో
ఆకాశంలోకి
పాకిపోయింది.
ప్రతి ఏడు పతంగుల
పండుగ కాలనీకి కొత్తదనం తెస్తుంది, మైదానం బెంచిపై కూర్చున్న పిల్లలు రవి, చందుల పాత్ర మాత్రం మారదు. వారు తలెత్తి తోకల సీతకోకచిలుకలని చూడడమో ఎవరైనా కాసేపు దారం పట్టుకోనిస్తే ఎగరేసి ఆనందించడం
తప్ప వాటిని సొంతం చేసుకోలేరు. కొనమని రవి తండ్రిని అడిగితే “అవి అలగా ఆటలురా, మనం ఆడకూడదు” అనంటారు కానీ అవే డబ్బులతో పాలో, పాలకూరో వస్తుందని లెక్కలు వేసుకుంటారని రవికి
తెలుసు. ఇక చందు తండ్రి తన చాలీ చాలని వడ్రంగి సంపాదనతో ఇంటిని నెట్టుకొస్తున్నారు, బాధ్యత తెలిసిన చందు నోరు తెరిచి అడిగే అవకాశం
లేదు. ఇలా మిత్రులిద్దరి నేపధ్యం వేరైనా, మాట్లాడే యాస వేరైనా...అంతరంగం ఒకటే, అవరోధాలు ఒకటే… దాంతో దోస్తీ కుదిరి జంట కవుల్లా తిరుగుతూ ఉంటారు.
ఇంకో రెండు రోజుల్లో
కాలనీ వేడుకలు పతాక స్థాయికి చేరుకుంటాయి, కమిటీ గోవర్ధన్ కోసం ప్రత్యేకంగా షామియనా వేయించి లౌడ్ స్పీకర్లో కామెంటరీ
చెప్పిస్తారు. అసలు పతంగుల పోటీలకి అతని మాటలు కలిపి వింటుంటే ఆ మజానే వేరు. ఆ
మాటల్ని వినడానికి చుట్టు పక్కల కాలనీల జనం ఆ రోజు అక్కడికి చేరుకుంటారంటే
అతిశయోక్తి కాదు.
గోవర్ధన్ పోయిన
ఏడాది చిన్నుని పెద్ద హీరోని చేసేసాడు “చిన్ను కీన్చ్ గొట్టుడు షురు జేసిండు... ఉస్తాద్ పొద్దుగాల సంది ఆర్ పతంగుల్
సాఫ్ జేసిండు...తమ్మీ ఎన్కకెల్లి జర్గు... చిన్ను మస్తు ఫోర్సుగ
ఒస్తుండు.....అప్నీ ఓల్డ్ సిటీ మె ఐసా కీన్చ్ కబ్బీ నయీ దేఖా“ ఆ రోజు నుండి చిన్ను ఎక్కడ కనబడ్డా “కీన్చ్ చిన్ను” అని తోక తగిలించి గౌరవంగా పిలిచేవారు..అదీ గోవర్ధన్ మాటకున్న మత్తు!
అందనంత ఎత్తుకి
ఎగరాలని తొందర పడేవి కొన్ని, పోటీకి సయ్యని ఉరకలు తీసేవి కొన్ని, నా ప్రపంచం నాదని ఎగిరే పతంగులు ఆకాశాన్ని నింపేసాయి, ఇద్దరు మిత్రులు ఆశగా చూస్తుంటే రెప, రెపలాడుతూ వచ్చిందో పెద్ద ఎరుపు, పసుపు రంగుల పతంగ్, చుట్టూ ఉన్న వాటిని తేలిక భావంతో చూస్తూ, గండబేరుండ పక్షిలా ఎగురుతోంది. అది ఎగరేస్తున్న
వాడు రేషన్ షాప్ యజమాని కొడుకు, గన్ను... బొద్దుగా, డబ్బా బెల్ బాటం ప్యాంటు వేసుకుని చేతిలో పెద్ద
చరఖా, గులాబి రంగు మాంజాతో మహా పకడ్బందీగా వచ్చాడు.
అతని చుట్టూ గుమిగూడిన పిల్లలు గొప్పగా చూస్తుంటే తెగ మిడిసిపడుతున్నాడు.
రవి అంత పెద్ద
పతంగ్ని ఎప్పుడూ చూడకపోవడంతో అప్రయత్నంగా గన్ను దగ్గరకి వెళ్ళాడు
“నేను నీ పతంగ్ కాసేపు ఎగరెయ్యోచ్చా?” అని అడిగాడు
“గిది అస్వంటిస్వంటి పతంగ్ కాదు..డోరాదార్” అని కరుగ్గా అన్నాడు గన్ను, చుట్టూ నిలబడ్డ పిల్లలు ‘అవును... నిజమే’ అన్నట్టుగా నవ్వారు. వెంటనే చందు కలగజేసుకుని “ఎల్లుండ మైదాన్ల మేమ్ మేమ్గూడ పిలాయిస్తం” అని ఉక్రోషంగా అన్నాడు.
“మొకం అద్దంల సూస్కున్నవా, నీకంత ఔఖాత్ ఉందా?” అని దెప్పుతూ “గిది పత్తర్గట్టి చరఖా, గుల్జారౌస్ మాంజా ఎర్కనా?” గొప్పగా అన్నాడు గన్ను.
చందు పేదరికాన్ని
గన్ను ఎగతాళి చెయ్యడం అది
మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాకపోవచ్చు. అతని మాటలకి పౌరుషంగా అనిపించినా గొడవ పడే ఇష్టం లేక
వెనక్కి తగ్గాడు చందు.
“ఆన్నెందుక్ అడిగినవ్, పైసలున్నయని ఫుల్ రుబాబ్” అన్నాడు చందు
“జస్ట్ ఓసారి పట్టుకుందామని అడిగానంతే” అన్నాడు రవి
“సుట్టూ పబ్లిక్ జమైతే పెద్ద మోతుబరి
అనుకుంటున్డు మోటే గాడు”
తన కంటే ఏడాది
పెద్దని తెలియని విషయాలు అడుగుతుంటాడు రవి, ఆ కారణంతో ఓపిగ్గా జవాబు చెప్తాడు చందు.
“అంత పెద్ద పతంగ్ ఎప్పుడూ చూడలేదు, ఎంత బావుందో”
“బోంబే కెల్లి ఇస్పెషల్ పేపర్ దెచ్చి సుట్టూ
దారం సుడ్తరు..గందుకే మంచిగుంటది”
“టు మినిట్స్లో ఎంత ఎత్తుకి ఎగిరిపోయిందో”
“మల్లెమన్కున్నవ్... జర్రట్ల బిలూన్లకి బోతది”
“మరి మనం కొనాలంటే ఎంతుంటుంది?”
“పక్కాగ తెల్వద్గానీ చాన పిరముంటదని తెల్సు....”
“అందరి ముందూ ఎగరేస్తామని చెప్పేసాం...కానీ ఎలా?..మ్చ్” అని రవి నిట్టూరుస్తుండగా “జాఫ్....జాఫ్“ అని అరుపులు వినిపించాయి, శబ్దం వచ్చిన వైపు చూడగానే అంత వరకు రాజఠీవీ
చూపించి మురిపించిన డోరాదార్ పోటీలో దారం తెగి వీరి వైపు వస్తోంది. తెగిన పతంగ్
ఎవరికి దొరికితే వారిదేనన్నది యుద్ధనీతి కాబట్టి పట్టుకుందుకు పరిగెట్టడం
మొదలెట్టారు, పోటీగా వారి చుట్టూ మరికొందరు జత అయ్యారు.
గాలిలో ఊరిస్తూ, వయ్యారంగా వంకీలు తిరుగుతున్న డోరాదార్ని
చూస్తూ చాలా వీధులు దాటారు, రవి ముట్టుకున్నా చాలని పరిగెడుతున్నాడు. ఎక్కడ
నుండి ఊడి పడ్డారో ముళ్ళకర్రలు పట్టుకున్న ఎత్తైన, నల్లటి ఆకారాలు అందర్నీ తోసుకుంటూ వెనుక నుంచి హఠాత్తుగా వచ్చారు. ఇంచుమించు
వీరి దాకా రాగానే రవి చెయ్య పట్టి చందు అమాంతం పక్కకి లాగాడు. ఆ గుంపు చెట్ల మధ్య
నుండి దిగుతున్న పతంగ్ని చిరక్కుండా పట్టుకుని మాయమయ్యారు.
చందు రొప్పుతూ “ఎర్ర బస్తీ’ అని అన్నాడు
“ముళ్ళకర్రలు చూడగానే వాళ్ళే అనుకున్నాను”
“మన కిస్మత్ మంచిగుంది, డేంజర్ గాల్లు పతంగ్ ముట్టుకుంటే ముల్లతో కొట్టేటోల్లు”
“కొంచంలో మిస్ అయిపోయింది లేకపోతే రెపరెపలాడే
పేపర్ని ఒక్కసారి ముట్టుకుందామనుకున్నా” అన్నాడు రవి .
ఎర్ర బస్తీ
కాలనీని ఆనుకున్న గుడిసెల బస్తీ, అక్కడి జిల్లయ్య గుంపు పతంగుల కోసం కాలనీలో కాపు కాస్తారు. ఆ మూకని చూడగానే
తప్పుకోవడం తప్ప తగువు పెట్టుకునే సాహసం అంకుల్స్ కూడా చెయ్యరు, ఇక పిల్లలెంత? అందొచ్చిన అదృష్టం చేజారిందని ఆకాశంలో వెతికితే సూర్యుడు వెలితిగా
అస్తమిస్తున్నాడు కానీ వారిద్దరిలో సంక్రాంతి రోజు డోరాదార్ ఎగరెయ్యాలనే కోరిక నిండుగా ఉదయించి.... త్వర, త్వరగా పెద్దదవుతోంది.
చీకటి జామ చెట్టు ఆకులపై నుండి అంతటా పరుచుకుంది, అప్పటికే పిల్లా, పెద్దా ఇళ్ళల్లోకి సద్దుకోవడంతో చలి రాత్రితో చేసే రహస్య మంతనాలకి అనువుగా ఉంది వీధి. రవి ఒక్కడూ గేటు దగ్గర తచ్చాడుతూ నాన్న కోసం ఎదురుచూస్తున్నాడు. వాళ్ళమ్మ “లోపలకి రా రా, జలుబు చేస్తుంది” అని ఎన్ని సార్లు పిలిచినా, ఏదో వంక పెట్టి అక్కడే నిలబడ్డాడు. అతని ధ్యాసంతా చందు అన్న వాక్యం “మనం మైదాన్ల పతంగ్ పిలాయించకుంటే గన్ను గాని ముందు ఇజ్జత్ పోతది” దగ్గర నిలిచిపోయింది.
మోపెడ్ శబ్దం
వినడంతో రవి మోహంలో కాస్త వెలుగొచ్చింది, ఎప్పుడు లేనిది ఎదురుగా కనపడేసరికి వాళ్ళ నాన్నగారికి కాస్త ఆశ్చర్యంగా
వేసింది “ఏరా, రాత్రి ఒక్కడివే నుంచున్నావు, భయంగా లేదా?” అన్నారు
“లేదు నాన్నా”
“లోపలకి పద లేకపోతే జలుబు చేస్తుంది” అన్నారు, రవి ఇక ఉండ బట్టలేక “నాన్నా! నాకు.... “ నోరు విప్పాడో లేదో వాళ్ళమ్మ అడ్డుపడింది “ఒరేయ్! ఆయన పొద్దుననగా ఆఫీసుకి వెళ్లారు, ఇంట్లోకి రానిస్తావా?”
“పర్వాలేదు చెప్పనియ్యవే”
“ఎల్లుండ సంక్రాంతికి నాకు చరఖా, మాంజా, డోరాదార్ పతంగ్ కొని పెట్టవా, ప్లీజ్”
“ఏవిటి, దోరాదారా?, వాటికీ పేర్లుంటాయా?” అని నవ్వారు
“చాలా బావుంటుంది నాన్నా, అది చూసుకునే ఈ రోజు గన్ను మాతో చీప్గా
మాట్లాడాడు”
“అవే డబ్బులు పెడితే ఎంచక్కా కొత్త బట్టలు
కొనుక్కోవచ్చు, కాగితం ముక్కయితే పుటుక్కున చిరిగిపోతుంది, ఇక గన్ను అంటావా, వాడి జోలికి వెళ్ళకండి” అని ఇంట్లోకి వెళ్ళిపోయారు.
“నాకు ఎగరెయ్యాలని ఉంది నాన్నా...అంతా హీరోలా
చూస్తుంటే ఎగరెయ్యాలని ఉంది నాన్నా” అణిచిపెట్టిన మాటలకి బదులుగా రవి కళ్ళు చెమ్మగిల్లాయి.
రవి వాళ్ళ బామ్మ
అన్నీ బాగా గమనిస్తుంది, గేటు దగ్గర తచ్చాడినపుడే అతన్ని ఏదో
తొలుస్తోందని ఆవిడకి తెలుసు. మొహం అదోలా పెట్టుకుని నడుస్తుంటే, చెయ్య పట్టుకుని తులసి కోట దగ్గరకి
తీసుకెళ్ళింది. ఆ మాటా, ఈ మాటా చెప్పి కాస్త కుదుట పడ్డాకా కంచంలో
ముద్దలు కలిప్పెడుతూ కధ మొదలుపెట్టింది “ఆంజనేయస్వామి లంకానగరం చేరుకోగానే అక్కడంతా
కటిక చీకటిగా ఉంది, అన్ని ద్వారాల దగ్గర రాక్షసులు కాపలా కాస్తూ
కనపడ్డారు, అప్పుడు ఆంజనేయస్వామి సూక్ష్మ రూపం దాల్చి
సీతమ్మవారి కోసం లంకా నగరమంతా గాలిస్తున్నాడు..“ అదేమీ విచిత్రమో, బామ్మ కాస్త కధ మొదలెట్టగానే రవి మోహంలో విచారం
పోయి యక్ష ప్రశ్నల మూడ్లోకి వచ్చాడు
బామ్మా! రాక్షసులు
ఎలా ఉంటారు?
“బడుద్ధాయి, అన్నీ తెలిసిన ప్రశ్నలు అడుగుతావు, సినిమాల్లో చూడలేదా?”
“చూడ్డం కంటే నువ్వు చెప్తే విని ఊహించుకోవడం
ఇంకా బావుంటుంది బామ్మా”
“సర్లే తెలిసిన విషయమే నువ్వు అడగడం, తెలీనట్టు నేను చెప్పడం మనకి అలవాటైన ఆటే కదా”
“ప్లీజ్ బామ్మా చెప్పు, ప్లీజ్.... ”
“పెద్ద మీసాలతో నల్లగా, ఎత్తుగా ఎర్రటి కళ్ళతో ఉంటారు; ముళ్ళ కర్రలు, వంకీలు తిరిగిన ఆయుధాలతో సామాన్య ప్రజలని, మునులని హింసిస్తారు..అశోక వనంలో సీతమ్మ వారిని.... ”
“అంటే మన ఎర్ర బస్తీ వాళ్ళ లాగ అన్నమాట”
“ఎందుకురా వాళ్ళు నిన్నేం చేసారు?”
“బామ్మా! ఈ రోజు చాలా అందమైన పతంగ్ ఇంచుమించు మా
చేతిలో పడింది, వాళ్ళొచ్చి ముళ్ళకర్రతో లాక్కుపోయారు”
“పోనీలేరా మనది కాని వస్తువు మనకెందుకు? అయినా వాళ్ళ దగ్గర కొనుక్కుందుకు పాపం
డబ్బులుండవు కదా ”
“నాకు ఎల్లుండ మైదానంలో ఎగరెయ్యాలని ఉంది బామ్మా, నాన్నని అడిగితే కొనను అన్నారు”
“నాకవన్నీ తెలీదురా, ఓ పావలా ఇస్తాను ఏదైనా తాయిలం కొనుక్కో..మళ్ళీ
మీ నాన్నకి చెప్పకు, గారం చేస్తున్నానని తిడతాడు” అని పావలా చేతిలో పెట్టింది.
ఆ రాత్రి జేబులోని
పావలాని రాక్షసులు లాక్కున్నట్టు కలలొచ్చి కలత నిద్రపోయాడు రవి. పొద్దున్న గొడవగా
మాటలు
వినబడి
మెలుకువొచ్చింది, కళ్ళు నులుముకుంటూ ఇంటి బయటకి రాగానే, చుట్టు పక్క ఇళ్ళ అంకుల్స్ గేటు దగ్గర గట్టిగా మాట్లాడుతున్నారు
“ఈ ఎర్ర బస్తీ వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి, ఈ రోజు నల్లాలు ఎత్తుకెళ్ళారు, రేపు బీరువాల దాకా వస్తారు... ఏదో ఒకటి చెయ్యక
పోతే చాలా ప్రమాదం”
“అరె పక్క గల్లీల మా దోస్త్ పయ్యలు ఎత్కపోయిన్రు
సర్!”
“వుయ్ షుడ్ నాట్ టోలరేట్, వుయ్ మస్ట్ కంప్లెయిన్ ఇట్ టు ది పొలీస్”
“నేను రేపే వెళ్లి మన జగన్నాధం గారు, అదేనండి లక్ష్మీ నగర్లో ఉంటారు చూడండి..
జర్నలిస్ట్...ఆయన్ని మన సమస్య కవర్ చెయ్యమంటాను”
బామ్మ మాత్రం “ఎవరింట్లో ఏది పోయినా ఎర్ర బస్తీ వాళ్ళ మీద
నెట్టేస్తారు” అంటూ నసుక్కుంది
రవికిదేం కొత్త
కాదు, రాత్రి వాళ్ళ ఇళ్ళల్లో చిన్నా, చితకా దొంగతనాలు జరగడం, పొద్దున్నే అంకుల్స్ మీటింగ్ పెట్టి ఏదైనా
గట్టిగా చెయ్యాలని అంతకంటే గట్టిగా తీర్మానం చెయ్యడం, ‘అమ్మో! ఆఫీసుకి లేట్ అవుతోందని’ మాయమవడం రోజూ జరిగే విషయమే.
*************
జైహింద్ హోటల్
దగ్గర పతంగుల దుఖాణాలు పెద్ద చరఖాలకి చుట్టిన రంగుల మాంజాలు, డిజైన్ పతంగులు, గులాల్తో నిండి ఉన్నాయి. పండుగ జనం ఉత్సాహం రోడ్డుపై చూపించడంతో ఎర్రటి దుమ్ము
గాలిలోకి రేగి వింత శోభని నింపింది. చందు దగ్గర ఆటాణా, రవి దగ్గర పావలా కలిపి ధరలు వాకబు చేస్తూ అన్ని
దుకాణాలు
తిరిగారు. ఎన్ని
సార్లు అడిగినా అవే ధరలు, వారి దగ్గర డబ్బులకి సాదా దారం తప్ప ఏమీ
రాలేదు.
జీవితమంటే
సర్దుకుపోవడం, పెద్దలని మారు అడక్కపోవడం, గన్ను వెటకారంగా నవ్వినా, ఎర్ర బస్తీ రాక్షసులు పతంగ్ తన్నుకుపోయినా
తప్పించుకుపోవడం తప్ప మార్గం లేదు. ఇద్దరి ఆలోచనలు మెత్తని కసితో నిండిపోయాయి.
సంక్రాంతి రోజు మైదానంలో లెక్కలు తేల్చుకోవాలని ఉంది కానీ సాదా దారం తప్ప ఏమీ
లేదు.
“గన్ను ఎంత లక్కీనో కదా?” అన్నాడు రవి
“అవ్.. వాల్లింట్ల ఒద్దన్నా కొంటరు, మీద్కెల్లి నోట్ల గులాబ్జామున్ గూడ కుక్కుతరు” అని నవ్వాడు చందు
“మరేం చేద్దాం? ఈ సారి కూడా పైకి చూసి లెక్క పెట్టడమేనా?”
“నా తానొక ప్లానుంది”
“మన వల్ల కాదు అని ఒప్పుకోవు... ప్లానేమిటో
చెప్పు”
“మనమే జేద్దాం”
“సొంతంగా తయారు చేసుకుందామా?”
“మా చిచ్చా దగ్గరొక ఇర్గిన చరఖా ఉంది, గది సెట్ జెయ్యాల, సాదా దారంతో మాంజా సుతాయించుదం”
“ఎలాగో తెలీదు పైగా మన దగ్గర ఉన్నది ఒక్క రోజు”
“మనం షురూ జేస్తే తెలుస్తది, కష్టమా? కాదా?” అని ఆస్మాన్ ఘాట్కి పదమన్నాడు చందు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల కంటే చేసి తెలుసుకోవడం, పనిని తేల్చుకోవడం చందుకి అలవాటు. వెనకాలే
నడవడం రవికి అలవాటు. ఇద్దరూ
కొండపై బండ
రాళ్ళల్లో నడుస్తుంటే ఎండ తీవ్రత ఇంకా ఎక్కువగా అనిపిస్తోంది. అక్కడ బ్రహ్మజెముడు
మొక్కలని వెతికి, ఒడుపుగా తెంపి గోను సంచీలో వేస్తున్నాడు చందు, రవి తన వంతు సాయంగా చేస్తున్నాడు. ఇద్దరికీ ఆ
మొక్కల్లో పాములు దాక్కుంటాయనే భయం కంటే మైదానంలో పరువనే ధ్యాసే ఎక్కువగా ఉంది ఎండ
ప్రతాపం చూపిస్తున్నా పట్టించుకునే సమయం లేదు, తెల్లారితే సంక్రాంతి....గోవర్ధన్ కామెంటరీ.. గన్ను నవ్వు... ప్రతి నిముషం విలువైనదే...
సరంజామా చందు
ఇంటికి చేర్చాకా “ఇయాల మా నయ్న సిద్ధంబర్ బజార్కు బోయిండు, షట్టర్ సగం మూసి పని జేస్కుందం” అన్నాడు చందు
ఆ మధ్యాహ్నం చందు
వడ్రంగి షెడ్డు వారి కార్ఖానా అయ్యింది; రోట్లో గాజు పెంకులు చితక్కొట్టి, బ్రహ్మ జెముడు రసం, అన్నం కలపగానే జిగురు ముద్ద తయారయ్యింది.
చందుని గుడ్డిగా అనుసరించడం తప్ప రవికి ఇదంతా కొత్తగా, భయంగా ఉంది.
“దారం గా సీకులకి సుట్టి గీ ముద్దతో సుతాయించు” అని వేరే పనిలో పడ్డాడు చందు. సీసం పెంకులు
ముట్టుకున్నానని తెలిస్తే ఇంట్లోంచి బయటకి పంపరని తెలిసినా రవి ఆపలేదు. లక్ష్యం
చేరాలనే కోరిక బలంగా ఉండడంతో భయాన్ని తాత్కాలికంగా మర్చిపోయాడు. సుతాయించిన మాంజాని ఎండబెట్టి ప్రతి పది నిముషాలకి
ఎండిందో, లేదో అని ఆతృతగా చూస్తూ గడిపాడు.
చందు చిత్తు
కాగితాలు తిరగేసి చూస్తుంటే, పతంగ్ చెయ్యడానికి న్యూస్ పేపర్ అణువుగా ఉంటుందని ఎప్పుడో అతని చిచ్చా చెప్పిన
విషయం గుర్తొచ్చింది. అప్పటికే చీకటి పడి, వెలుతురు రోజూ కంటే వేగంగా తగ్గుతోంది. అయినా తల వంచి పట్టుదలగా పని చేస్తూనే ఉన్నారు. కాగితాన్ని
సరిగ్గా సైజుకి కత్తిరించి, అన్నం ముద్దతో సన్నటి వెదురుబద్దలు చుట్టూతా
అతికించి పతంగ్ తయారు చేసారు, అది చూడగానే ఇద్దరి మోహంలో తృప్తి తొంగిచూసింది. .
“బాగ చీకటయ్యింది, మీ ఇంట్ల పరేషాన్ అయ్తరు, ఇగ ఇంటికి బో ”
“మరి చరఖా సంగతి”
“అది నేన్ జూస్కుంట” అని హామీ ఇచ్చి రవిని ఇంటికి పంపాడు చందు
*************
ఆ రోజు కోసం ఆకాశం
కూడా ఆతృతగా ఎదురుచూస్తోంది, మబ్బుల అడ్డు లేకుండా స్పష్టమైన నీలి రంగుతో ముస్తాబయ్యింది. “చానా దూరం కెల్లి మన కాల్నీకొచ్చిన పబ్లిక్కి
నమస్తే......’ అన్న గోవర్ధన్ పలకరింపుతో వేడుకలు ప్రారంభం
కాగానే పతంగుల పోటీ అరుపులతో కాలనీ మిద్దెలు, మైదానం హోరెత్తిపోయాయి. చిరుతిళ్ల తోపుడు బళ్ళ ‘చీటీ వాలే బడే మౌజ్’,
‘తోతా పరి... సోనే
కి చిడీ... బుల్ బుల్ కి బడీ’ అరుపులుతో మైదానం ఇంచుమించు నాంపల్లి నుమాయిష్లా ఉంది.
గన్ను పండుగ
బట్టలు, కొత్త సరంజామాతో అలవాటైన చోట స్థిరపడ్డాడు.
మిత్రులిద్దరు అక్కడికి చేరుకోగానే అతనికి కనిపించేంత దూరంలో వింత చరఖాతో, కట్టుడు పతంగ్తో నిలబడ్డారు. వారిని చూడగానే
గన్ను హావభావాలు మారిపోయాయి, ఇక ఉండబట్టలేక “అరె మంచిగుంది తున్కల్, తున్కల్ పతంగ్, యాడికెల్లి ఎత్కొచ్చినవ్” అని
వెటకరించాడు.
“మాతాన రేషన్ పైసల్లేవు, కష్టబడి మేమే జేస్కున్నం” అని సరైన చోట తగిలేలా జవాబు చెప్పాడు చందు
“అట్లనా పెంచ్ల సూస్కుందం” అని గన్ను సవాలు విసరగానే, “రవి.. జర దూరం బోయి పతంగ్ ఇడ్వు” అని సయ్యన్నాడు చందు. చుట్టూ మూగిన పిల్లలకి వీరి పోటీ
ఆసక్తిగా మారింది.
చందు దారం పైకి
లాగగానే పతంగ్ కాస్త ఎత్తుకి ఎగిరింది, అది చూసి ఇద్దరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాసేపు అటు, ఇటు తటపటాయించి, తలకిందులుగా తిరిగి నేలపై రాలిపోయింది. ఓపిగ్గా ఎన్ని సార్లు ప్రయత్నించినా
అలానే
ఒరిగిపోయింది.
కాస్త దగ్గరగా పరీక్షిస్తే మధ్యలో పెట్టిన వెదురుబద్ద బాగా మందంగా ఉండడం కారణమని
తేలిపోయింది.
రాత్రి పతంగ్
చేసాకా ఎగురుతుందా, లేదా అని చూసుకునే సమయం మిగల్లేదు, ఇప్పుడు గన్ను అవమానం మాత్రం అలానే మిగిలింది.
ఇంకా ఎండలో బ్రహ్మజెముడు ఆకులు తుంచుతున్నట్టే ఉంది. చందు చేతిలో ఎర్రటి రక్తపు
గీతలు అలానే ఉన్నాయి. జీవితం ఒకరికి అతిగా వడ్డించిన విస్తరి, మరొకరికి ఖాళీ అతుకుల విస్తరి.
ఇష్టమైన పండుగ అంటే
ఎల్లప్పుడూ ఊరించే వేడుక, పతంగ్ అంటే బట్టలు కొంటా అంటారు, పావలాతో పీచు మిఠాయి మాత్రం ఒస్తుంది... పాత
విసుగులన్నీ రవి, చందులని ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఇంకో పక్క
గోవర్ధన్ మాటలు హెచ్చు స్థాయిలో వినిపిస్తున్నాయి “చిల్క శీను డీల్ వద్లుడు షురు జేసిండు... కాటే... ఇంకొక పతంగ్ కోసిండు... .
ఎంత స్మూత్గ స్సాఫ్ జేసిండ్ర బై శీను... డీల్ అంటే మన చిల్క శీను..ఓల్డ్ సిటీల
గిస్వంటి... ”
ఆలోచనలు పూర్తిగా
అలిసిపోవడంతో, బెంచీపై స్థిరపడి మౌనంగా పోటీలు చూస్తున్నారు, మాములుగా వేగంగా సాగే సమయం, ఆ రోజు మెల్లిగా సాగుతూ మిట్ట మధ్యాహ్నం దాకా
చేర్చింది “ఆకలైతుంది ఇక ఇంటికి బోతా” అని లేచాడు చందు. “నువ్వు వెళ్ళిపోతే నేనేం చేస్తా” అని రవి కూడా లేచాడు. ఎదురుగా రేగిన జుట్టుతో
ఎర్ర బస్తీ జిల్లయ్య కనపడ్డాడు, ఇంకో రోజు అయితే ఇద్దరికీ అనుమానం లేకుండా ఒణుకు పుట్టేది. కానీ ఈ రోజు వారు
వేరే మనుషులు, ఏదో కోల్పోతామనే భయం ఇద్దరిలో లేదు. జిల్లయ్య
చరఖా కోసమే వచ్చాడని, ఏ ఉపయోగం లేని వక్రపు చరఖా ఉంటే ఎంత, లేకపోతే ఎంతని అతని కళ్ళల్లోకి సూటిగా చూసారు.
“మిమ్లని పొద్దుమీకెల్లి సూస్తున్న, చరఖా పట్కొని తిర్గుతున్నవ్, పతంగ్ లేదా?” అన్నాడు జిల్లయ్య
“అవును లేదు”
“ఎందుకు”
“కొననికె పైసల్లేవు” అన్నాడు చందు
“మాతాన గూడ పైసల్ ఉండవు, గందుకే గోడల్ దుమ్కి... రోడ్లపై ఉర్కుర్కి
పతంగుల్ పడ్తము” అని వెకిలిగా నవ్వాడు
చెయ్య ముందుకి
చాస్తూ “నీకు చరఖా కావాలా?” అని అడిగాడు రవి
“ఏ ఒద్దు నేనెమ్ జేస్తా గా ఫాల్తు చర్కాతోని...
నువ్వే గీ పతంగ్ తీస్కో”
అని అందమైన
డోరాదార్ రవి చేతిలో పెట్టాడు. రావణుడు అనుకుంటే రాముడిలా వరమిచ్చాడు, ఎందుకిచ్చాడో అర్థం కాలేదు, వాళ్ళూ అడగలేదు... ఎందుకంటే తెరుకునేసరికి అతను
వెళ్ళిపోయాడు.
“ఎందుకిచ్చాడో తెలుసా”
“ఖాలీగా చరఖా పట్కొని తిర్గుతుంటే పాపమని
ఇచ్చిన్డెమో” అన్నాడు చందు
“అందుకేనేమో వాళ్ళు మంచివాళ్ళే అంటుంది మా బామ్మ” అన్నాడు రవి
జిల్లయ్య పోసిన
జీవంతో ఇద్దరూ రెట్టించిన ఉత్సాహంగా మైదానంలోకి దిగారు, డోరాదార్ కపిరాజు జెండాలా రెప, రెపలాడుతూ వారిపై పోటీకొచ్చిన గన్ను పతంగ్ని
వీరి ప్రమేయం లేకుండా తెగ్గొట్టింది. దారం చేతులు మార్చుకుంటూ ఇద్దరూ సంతోషం
పంచుకుంటుంటే ఓ చిన్న కుర్రాడు వాళ్ళ దగ్గరకి వచ్చి “గోవర్ధనన్న నీ పేరడిగిండు” అన్నాడు.
“నా పేరు రవి, నా దోస్త్ చందు” అని చూపించగానే ఆ కుర్రాడు షామియానా వైపు
పరిగెత్తాడు
“కొత్త పొరగాల్లు రవి, చందు జీబా డోరాదార్ పిలాయిస్తున్రు, మస్తు షాన్దార్గుంది పతంగ్...గిప్పుడే ఒక పతంగ్
కోసిన్రు... ” గోవర్దన్ మాటలు ఇద్దరినీ లీలగా
తాకుతున్నాయి...అప్పటికే వారు పరిభ్రమించే పరిధులు దాటి గమ్యం
చేరుకున్నారు...అక్కడ పోటీలు, పోలికలు, ప్రశంసలు లేవు, కేవలం స్వేచ్ఛ ఉంది, స్ఫూర్తినిచ్చే ఊపిరి ఉంది. చందు బాషలో “మస్తు మజా ఒచ్చింది”!!
*************
No comments:
Post a Comment