Thursday, August 14, 2014

డోరాదార్

 Kinige Magazine, August, 2014

 

కాలనీలో ఇళ్ళు వరుసగా ఇటుకలు పేర్చినట్టున్నాయి, రోడ్డుకి ఇరుపక్కలా పెరిగిన చెట్లు దారిని గొడుగులా కప్పి వెలుతురుని తగ్గించేసాయి. మల్లేష్ పాల దుకాణం, రామాలయం దాటుకుంటూ కమ్యూనిటీ హాల్ మైదానం చేరుకోగానే చెట్లని తప్పించుకుని ఆకాశం ఒక్కసారిగా తెరుచుకుంది. మాములుగా రోడ్లపై కనిపించే ఆటల సందడి జనవరి నెల రావడంతో  ఆకాశంలోకి పాకిపోయింది.

 

ప్రతి ఏడు పతంగుల పండుగ కాలనీకి కొత్తదనం తెస్తుంది, మైదానం బెంచిపై కూర్చున్న పిల్లలు రవి, చందుల పాత్ర మాత్రం మారదు. వారు తలెత్తి తోకల సీతకోకచిలుకలని చూడడమో ఎవరైనా  కాసేపు దారం పట్టుకోనిస్తే ఎగరేసి ఆనందించడం తప్ప వాటిని సొంతం చేసుకోలేరు. కొనమని రవి తండ్రిని అడిగితేఅవి అలగా ఆటలురా, మనం ఆడకూడదుఅనంటారు కానీ అవే డబ్బులతో పాలో, పాలకూరో వస్తుందని లెక్కలు వేసుకుంటారని రవికి తెలుసు. ఇక చందు తండ్రి తన చాలీ చాలని వడ్రంగి సంపాదనతో ఇంటిని నెట్టుకొస్తున్నారు, బాధ్యత తెలిసిన చందు నోరు తెరిచి అడిగే అవకాశం లేదు. ఇలా మిత్రులిద్దరి నేపధ్యం వేరైనా, మాట్లాడే యాస వేరైనా...అంతరంగం ఒకటే, అవరోధాలు ఒకటేదాంతో దోస్తీ కుదిరి జంట కవుల్లా తిరుగుతూ ఉంటారు.

 

ఇంకో రెండు రోజుల్లో కాలనీ వేడుకలు పతాక స్థాయికి చేరుకుంటాయి, కమిటీ గోవర్ధన్ కోసం ప్రత్యేకంగా షామియనా వేయించి లౌడ్ స్పీకర్లో కామెంటరీ చెప్పిస్తారు. అసలు పతంగుల పోటీలకి అతని మాటలు కలిపి వింటుంటే ఆ మజానే వేరు. ఆ మాటల్ని వినడానికి చుట్టు పక్కల కాలనీల జనం ఆ రోజు అక్కడికి చేరుకుంటారంటే అతిశయోక్తి కాదు.

 

గోవర్ధన్ పోయిన ఏడాది చిన్నుని పెద్ద హీరోని చేసేసాడుచిన్ను కీన్చ్ గొట్టుడు షురు జేసిండు... ఉస్తాద్ పొద్దుగాల సంది ఆర్ పతంగుల్ సాఫ్ జేసిండు...తమ్మీ ఎన్కకెల్లి జర్గు... చిన్ను మస్తు ఫోర్సుగ ఒస్తుండు.....అప్నీ ఓల్డ్ సిటీ మె ఐసా కీన్చ్ కబ్బీ నయీ దేఖాఆ రోజు నుండి చిన్ను ఎక్కడ కనబడ్డాకీన్చ్ చిన్నుఅని తోక తగిలించి గౌరవంగా  పిలిచేవారు..అదీ గోవర్ధన్ మాటకున్న మత్తు!

 

అందనంత ఎత్తుకి ఎగరాలని తొందర పడేవి కొన్ని, పోటీకి సయ్యని ఉరకలు తీసేవి కొన్ని, నా ప్రపంచం నాదని ఎగిరే పతంగులు ఆకాశాన్ని నింపేసాయి, ఇద్దరు మిత్రులు ఆశగా చూస్తుంటే రెప, రెపలాడుతూ వచ్చిందో పెద్ద ఎరుపు, పసుపు రంగుల పతంగ్, చుట్టూ ఉన్న వాటిని తేలిక భావంతో చూస్తూ, గండబేరుండ పక్షిలా ఎగురుతోంది. అది ఎగరేస్తున్న వాడు రేషన్ షాప్ యజమాని కొడుకు, గన్ను... బొద్దుగా, డబ్బా బెల్ బాటం ప్యాంటు వేసుకుని చేతిలో పెద్ద చరఖా, గులాబి రంగు మాంజాతో మహా పకడ్బందీగా వచ్చాడు. అతని చుట్టూ గుమిగూడిన పిల్లలు గొప్పగా చూస్తుంటే తెగ మిడిసిపడుతున్నాడు.  

 

రవి అంత పెద్ద పతంగ్ని ఎప్పుడూ చూడకపోవడంతో అప్రయత్నంగా గన్ను దగ్గరకి వెళ్ళాడు  

 

నేను నీ పతంగ్ కాసేపు ఎగరెయ్యోచ్చా?” అని అడిగాడు

 

గిది అస్వంటిస్వంటి పతంగ్ కాదు..డోరాదార్అని కరుగ్గా అన్నాడు గన్ను, చుట్టూ నిలబడ్డ పిల్లలుఅవును... నిజమేఅన్నట్టుగా నవ్వారు. వెంటనే చందు కలగజేసుకునిఎల్లుండ మైదాన్ల మేమ్ మేమ్గూడ పిలాయిస్తంఅని ఉక్రోషంగా అన్నాడు.

 

మొకం అద్దంల సూస్కున్నవా, నీకంత ఔఖాత్ ఉందా?” అని దెప్పుతూగిది పత్తర్గట్టి చరఖా, గుల్జారౌస్ మాంజా ఎర్కనా?” గొప్పగా అన్నాడు గన్ను.

 

చందు పేదరికాన్ని గన్ను ఎగతాళి చెయ్యడం అది  మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాకపోవచ్చు. అతని మాటలకి  పౌరుషంగా అనిపించినా గొడవ పడే ఇష్టం లేక వెనక్కి తగ్గాడు చందు.   

 

ఆన్నెందుక్ అడిగినవ్, పైసలున్నయని ఫుల్ రుబాబ్అన్నాడు చందు

 

జస్ట్ ఓసారి పట్టుకుందామని అడిగానంతేఅన్నాడు రవి

 

సుట్టూ పబ్లిక్ జమైతే పెద్ద మోతుబరి అనుకుంటున్డు మోటే గాడు

 

తన కంటే ఏడాది పెద్దని తెలియని విషయాలు అడుగుతుంటాడు రవి, ఆ కారణంతో ఓపిగ్గా జవాబు చెప్తాడు చందు.

 

అంత పెద్ద పతంగ్ ఎప్పుడూ చూడలేదు, ఎంత బావుందో

 

బోంబే కెల్లి ఇస్పెషల్ పేపర్ దెచ్చి సుట్టూ దారం సుడ్తరు..గందుకే మంచిగుంటది

 

టు మినిట్స్లో ఎంత ఎత్తుకి ఎగిరిపోయిందో

 

మల్లెమన్కున్నవ్...  జర్రట్ల బిలూన్లకి బోతది

 

మరి మనం కొనాలంటే ఎంతుంటుంది?”

 

పక్కాగ తెల్వద్గానీ చాన పిరముంటదని తెల్సు....

 

అందరి ముందూ ఎగరేస్తామని చెప్పేసాం...కానీ ఎలా?..మ్చ్అని రవి నిట్టూరుస్తుండగాజాఫ్....జాఫ్అని అరుపులు వినిపించాయి, శబ్దం వచ్చిన వైపు చూడగానే అంత వరకు రాజఠీవీ చూపించి మురిపించిన డోరాదార్ పోటీలో దారం తెగి వీరి వైపు వస్తోంది. తెగిన పతంగ్ ఎవరికి దొరికితే వారిదేనన్నది యుద్ధనీతి కాబట్టి పట్టుకుందుకు పరిగెట్టడం మొదలెట్టారు, పోటీగా వారి చుట్టూ మరికొందరు జత అయ్యారు.  

 

గాలిలో ఊరిస్తూ, వయ్యారంగా వంకీలు తిరుగుతున్న డోరాదార్ని చూస్తూ చాలా వీధులు దాటారు, రవి ముట్టుకున్నా చాలని పరిగెడుతున్నాడు. ఎక్కడ నుండి ఊడి పడ్డారో ముళ్ళకర్రలు పట్టుకున్న ఎత్తైన, నల్లటి ఆకారాలు అందర్నీ తోసుకుంటూ వెనుక నుంచి హఠాత్తుగా వచ్చారు. ఇంచుమించు వీరి దాకా రాగానే రవి చెయ్య పట్టి చందు అమాంతం పక్కకి లాగాడు. ఆ గుంపు చెట్ల మధ్య నుండి దిగుతున్న పతంగ్ని చిరక్కుండా పట్టుకుని మాయమయ్యారు.

 

చందు రొప్పుతూఎర్ర బస్తీఅని అన్నాడు

 

ముళ్ళకర్రలు  చూడగానే వాళ్ళే అనుకున్నాను

 

మన కిస్మత్ మంచిగుంది, డేంజర్ గాల్లు పతంగ్ ముట్టుకుంటే ముల్లతో కొట్టేటోల్లు

 

కొంచంలో మిస్ అయిపోయింది లేకపోతే రెపరెపలాడే పేపర్ని ఒక్కసారి ముట్టుకుందామనుకున్నాఅన్నాడు రవి .

 

ఎర్ర బస్తీ కాలనీని ఆనుకున్న గుడిసెల బస్తీ, అక్కడి జిల్లయ్య గుంపు పతంగుల కోసం కాలనీలో కాపు కాస్తారు. ఆ మూకని చూడగానే తప్పుకోవడం తప్ప తగువు పెట్టుకునే సాహసం అంకుల్స్ కూడా చెయ్యరు, ఇక పిల్లలెంత? అందొచ్చిన అదృష్టం చేజారిందని ఆకాశంలో వెతికితే సూర్యుడు వెలితిగా అస్తమిస్తున్నాడు కానీ వారిద్దరిలో సంక్రాంతి రోజు డోరాదార్  ఎగరెయ్యాలనే కోరిక నిండుగా  ఉదయించి.... త్వర, త్వరగా పెద్దదవుతోంది.

                                                                         *************

చీకటి జామ చెట్టు ఆకులపై నుండి అంతటా పరుచుకుంది, అప్పటికే పిల్లా, పెద్దా ఇళ్ళల్లోకి సద్దుకోవడంతో చలి రాత్రితో  చేసే రహస్య మంతనాలకి అనువుగా ఉంది వీధి. రవి ఒక్కడూ గేటు దగ్గర తచ్చాడుతూ నాన్న కోసం ఎదురుచూస్తున్నాడు. వాళ్ళమ్మలోపలకి రా రా, జలుబు చేస్తుందిఅని ఎన్ని సార్లు పిలిచినా, ఏదో వంక పెట్టి అక్కడే నిలబడ్డాడు. అతని ధ్యాసంతా చందు అన్న వాక్యంమనం మైదాన్ల పతంగ్ పిలాయించకుంటే గన్ను గాని ముందు ఇజ్జత్ పోతదిదగ్గర నిలిచిపోయింది.

 

మోపెడ్ శబ్దం వినడంతో రవి మోహంలో కాస్త వెలుగొచ్చింది, ఎప్పుడు లేనిది ఎదురుగా కనపడేసరికి వాళ్ళ నాన్నగారికి కాస్త ఆశ్చర్యంగా వేసిందిఏరా, రాత్రి ఒక్కడివే నుంచున్నావు, భయంగా లేదా?” అన్నారు

 

లేదు నాన్నా

 

లోపలకి పద లేకపోతే జలుబు చేస్తుందిఅన్నారు, రవి ఇక ఉండ బట్టలేకనాన్నా! నాకు....నోరు విప్పాడో లేదో వాళ్ళమ్మ అడ్డుపడిందిఒరేయ్! ఆయన పొద్దుననగా ఆఫీసుకి వెళ్లారు, ఇంట్లోకి రానిస్తావా?”

 

పర్వాలేదు చెప్పనియ్యవే

 

ఎల్లుండ సంక్రాంతికి నాకు చరఖా, మాంజా, డోరాదార్ పతంగ్ కొని పెట్టవా, ప్లీజ్

 

ఏవిటి, దోరాదారా?, వాటికీ పేర్లుంటాయా?” అని నవ్వారు

 

చాలా బావుంటుంది నాన్నా, అది చూసుకునే ఈ రోజు గన్ను మాతో చీప్గా మాట్లాడాడు

 

అవే డబ్బులు పెడితే ఎంచక్కా కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, కాగితం ముక్కయితే పుటుక్కున చిరిగిపోతుంది, ఇక గన్ను అంటావా, వాడి జోలికి వెళ్ళకండిఅని  ఇంట్లోకి వెళ్ళిపోయారు.

 

నాకు ఎగరెయ్యాలని ఉంది నాన్నా...అంతా హీరోలా చూస్తుంటే ఎగరెయ్యాలని ఉంది నాన్నాఅణిచిపెట్టిన మాటలకి బదులుగా రవి కళ్ళు చెమ్మగిల్లాయి.

 

రవి వాళ్ళ బామ్మ అన్నీ బాగా గమనిస్తుంది, గేటు దగ్గర తచ్చాడినపుడే అతన్ని ఏదో తొలుస్తోందని ఆవిడకి తెలుసు. మొహం అదోలా పెట్టుకుని నడుస్తుంటే, చెయ్య పట్టుకుని తులసి కోట దగ్గరకి తీసుకెళ్ళింది. ఆ మాటా, ఈ మాటా చెప్పి కాస్త కుదుట పడ్డాకా కంచంలో ముద్దలు కలిప్పెడుతూ కధ మొదలుపెట్టింది  “ఆంజనేయస్వామి లంకానగరం చేరుకోగానే అక్కడంతా కటిక చీకటిగా ఉంది, అన్ని ద్వారాల దగ్గర రాక్షసులు కాపలా కాస్తూ కనపడ్డారు, అప్పుడు ఆంజనేయస్వామి సూక్ష్మ రూపం దాల్చి సీతమ్మవారి కోసం లంకా నగరమంతా గాలిస్తున్నాడు..అదేమీ విచిత్రమో, బామ్మ కాస్త కధ మొదలెట్టగానే రవి మోహంలో విచారం పోయి యక్ష ప్రశ్నల మూడ్లోకి వచ్చాడు

 

బామ్మా! రాక్షసులు ఎలా ఉంటారు?

 

బడుద్ధాయి, అన్నీ తెలిసిన ప్రశ్నలు అడుగుతావు, సినిమాల్లో చూడలేదా?”

 

చూడ్డం కంటే నువ్వు చెప్తే విని ఊహించుకోవడం ఇంకా బావుంటుంది బామ్మా

 

సర్లే తెలిసిన విషయమే నువ్వు అడగడం, తెలీనట్టు నేను చెప్పడం మనకి అలవాటైన ఆటే కదా

 

ప్లీజ్ బామ్మా చెప్పు, ప్లీజ్....

 

పెద్ద మీసాలతో నల్లగా, ఎత్తుగా ఎర్రటి కళ్ళతో ఉంటారు; ముళ్ళ కర్రలు, వంకీలు తిరిగిన ఆయుధాలతో సామాన్య ప్రజలని, మునులని హింసిస్తారు..అశోక వనంలో సీతమ్మ వారిని....

 

అంటే మన ఎర్ర బస్తీ వాళ్ళ లాగ అన్నమాట

 

ఎందుకురా వాళ్ళు నిన్నేం చేసారు?”

 

బామ్మా! ఈ రోజు చాలా అందమైన పతంగ్ ఇంచుమించు మా చేతిలో పడింది, వాళ్ళొచ్చి ముళ్ళకర్రతో లాక్కుపోయారు

 

పోనీలేరా మనది కాని వస్తువు మనకెందుకు? అయినా వాళ్ళ దగ్గర కొనుక్కుందుకు పాపం డబ్బులుండవు కదా

 

నాకు ఎల్లుండ మైదానంలో ఎగరెయ్యాలని ఉంది బామ్మా, నాన్నని అడిగితే కొనను అన్నారు

 

నాకవన్నీ తెలీదురా, ఓ పావలా ఇస్తాను ఏదైనా తాయిలం కొనుక్కో..మళ్ళీ మీ నాన్నకి చెప్పకు, గారం చేస్తున్నానని తిడతాడుఅని పావలా చేతిలో పెట్టింది.

 

ఆ రాత్రి జేబులోని పావలాని రాక్షసులు లాక్కున్నట్టు కలలొచ్చి కలత నిద్రపోయాడు రవి. పొద్దున్న గొడవగా మాటలు  వినబడి మెలుకువొచ్చింది, కళ్ళు నులుముకుంటూ ఇంటి బయటకి రాగానే, చుట్టు పక్క ఇళ్ళ అంకుల్స్ గేటు దగ్గర  గట్టిగా మాట్లాడుతున్నారు

 

ఈ ఎర్ర బస్తీ వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి, ఈ రోజు నల్లాలు ఎత్తుకెళ్ళారు, రేపు బీరువాల దాకా వస్తారు... ఏదో ఒకటి చెయ్యక పోతే చాలా ప్రమాదం

 

అరె పక్క గల్లీల మా దోస్త్ పయ్యలు ఎత్కపోయిన్రు సర్!

 

వుయ్ షుడ్ నాట్ టోలరేట్, వుయ్ మస్ట్ కంప్లెయిన్ ఇట్ టు ది పొలీస్

 

నేను రేపే వెళ్లి మన జగన్నాధం గారు, అదేనండి లక్ష్మీ నగర్లో ఉంటారు చూడండి.. జర్నలిస్ట్...ఆయన్ని మన సమస్య కవర్ చెయ్యమంటాను

 

బామ్మ మాత్రంఎవరింట్లో ఏది పోయినా ఎర్ర బస్తీ వాళ్ళ మీద నెట్టేస్తారుఅంటూ నసుక్కుంది

 

రవికిదేం కొత్త కాదు, రాత్రి వాళ్ళ ఇళ్ళల్లో చిన్నా, చితకా దొంగతనాలు జరగడం, పొద్దున్నే అంకుల్స్ మీటింగ్ పెట్టి ఏదైనా గట్టిగా చెయ్యాలని అంతకంటే గట్టిగా తీర్మానం చెయ్యడం, ‘అమ్మో! ఆఫీసుకి లేట్ అవుతోందనిమాయమవడం రోజూ జరిగే విషయమే.  

 

*************

 

జైహింద్ హోటల్ దగ్గర పతంగుల దుఖాణాలు పెద్ద చరఖాలకి చుట్టిన రంగుల మాంజాలు, డిజైన్ పతంగులు, గులాల్తో నిండి ఉన్నాయి. పండుగ జనం ఉత్సాహం రోడ్డుపై చూపించడంతో ఎర్రటి దుమ్ము గాలిలోకి రేగి వింత శోభని నింపింది. చందు దగ్గర ఆటాణా, రవి దగ్గర పావలా కలిపి ధరలు వాకబు చేస్తూ అన్ని దుకాణాలు  తిరిగారు. ఎన్ని సార్లు అడిగినా అవే ధరలు, వారి దగ్గర డబ్బులకి సాదా దారం తప్ప ఏమీ రాలేదు.

 

జీవితమంటే సర్దుకుపోవడం, పెద్దలని మారు అడక్కపోవడం, గన్ను వెటకారంగా నవ్వినా, ఎర్ర బస్తీ రాక్షసులు పతంగ్ తన్నుకుపోయినా తప్పించుకుపోవడం తప్ప మార్గం లేదు. ఇద్దరి ఆలోచనలు మెత్తని కసితో నిండిపోయాయి. సంక్రాంతి రోజు మైదానంలో లెక్కలు తేల్చుకోవాలని ఉంది కానీ సాదా దారం తప్ప ఏమీ లేదు.

 

గన్ను ఎంత లక్కీనో కదా?” అన్నాడు రవి

 

అవ్.. వాల్లింట్ల ఒద్దన్నా కొంటరు, మీద్కెల్లి నోట్ల గులాబ్జామున్ గూడ కుక్కుతరుఅని నవ్వాడు చందు  

 

మరేం చేద్దాం? ఈ సారి కూడా పైకి చూసి లెక్క పెట్టడమేనా?”

 

నా తానొక ప్లానుంది

 

మన వల్ల కాదు అని ఒప్పుకోవు... ప్లానేమిటో చెప్పు

 

మనమే జేద్దాం

 

సొంతంగా తయారు చేసుకుందామా?”

 

మా చిచ్చా దగ్గరొక ఇర్గిన చరఖా ఉంది, గది సెట్ జెయ్యాల, సాదా దారంతో మాంజా  సుతాయించుదం

 

ఎలాగో తెలీదు పైగా మన దగ్గర ఉన్నది ఒక్క రోజు

 

మనం షురూ జేస్తే తెలుస్తది, కష్టమా? కాదా?” అని ఆస్మాన్ ఘాట్కి పదమన్నాడు చందు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల కంటే చేసి తెలుసుకోవడం, పనిని తేల్చుకోవడం చందుకి అలవాటు. వెనకాలే నడవడం రవికి అలవాటు. ఇద్దరూ   

కొండపై బండ రాళ్ళల్లో నడుస్తుంటే ఎండ తీవ్రత ఇంకా ఎక్కువగా అనిపిస్తోంది. అక్కడ బ్రహ్మజెముడు మొక్కలని వెతికి, ఒడుపుగా తెంపి గోను సంచీలో వేస్తున్నాడు చందు, రవి తన వంతు సాయంగా చేస్తున్నాడు. ఇద్దరికీ ఆ మొక్కల్లో పాములు దాక్కుంటాయనే భయం కంటే మైదానంలో పరువనే ధ్యాసే ఎక్కువగా ఉంది ఎండ ప్రతాపం చూపిస్తున్నా పట్టించుకునే సమయం లేదు, తెల్లారితే సంక్రాంతి....గోవర్ధన్ కామెంటరీ.. గన్ను నవ్వు...  ప్రతి నిముషం విలువైనదే...

 

సరంజామా చందు ఇంటికి చేర్చాకాఇయాల మా నయ్న సిద్ధంబర్ బజార్కు బోయిండు, షట్టర్ సగం మూసి పని జేస్కుందంఅన్నాడు చందు

 

ఆ మధ్యాహ్నం చందు వడ్రంగి షెడ్డు వారి కార్ఖానా అయ్యింది; రోట్లో గాజు పెంకులు చితక్కొట్టి, బ్రహ్మ జెముడు రసం, అన్నం కలపగానే జిగురు ముద్ద తయారయ్యింది. చందుని గుడ్డిగా అనుసరించడం తప్ప రవికి ఇదంతా కొత్తగా, భయంగా  ఉంది.

 

దారం గా సీకులకి సుట్టి గీ ముద్దతో సుతాయించుఅని వేరే పనిలో పడ్డాడు చందు. సీసం పెంకులు ముట్టుకున్నానని తెలిస్తే ఇంట్లోంచి బయటకి పంపరని తెలిసినా రవి ఆపలేదు. లక్ష్యం చేరాలనే కోరిక బలంగా ఉండడంతో భయాన్ని  తాత్కాలికంగా మర్చిపోయాడు. సుతాయించిన మాంజాని ఎండబెట్టి ప్రతి పది నిముషాలకి ఎండిందో, లేదో అని ఆతృతగా చూస్తూ గడిపాడు.

 

చందు చిత్తు కాగితాలు తిరగేసి చూస్తుంటే, పతంగ్ చెయ్యడానికి న్యూస్ పేపర్ అణువుగా ఉంటుందని ఎప్పుడో అతని చిచ్చా చెప్పిన విషయం గుర్తొచ్చింది. అప్పటికే చీకటి పడి, వెలుతురు రోజూ కంటే వేగంగా తగ్గుతోంది. అయినా తల వంచి  పట్టుదలగా పని చేస్తూనే ఉన్నారు. కాగితాన్ని సరిగ్గా సైజుకి కత్తిరించి, అన్నం ముద్దతో సన్నటి వెదురుబద్దలు చుట్టూతా అతికించి పతంగ్ తయారు చేసారు, అది చూడగానే ఇద్దరి మోహంలో తృప్తి తొంగిచూసింది. .

 

బాగ చీకటయ్యింది, మీ ఇంట్ల పరేషాన్ అయ్తరు, ఇగ ఇంటికి బో

 

మరి చరఖా సంగతి

 

అది నేన్ జూస్కుంటఅని హామీ ఇచ్చి రవిని ఇంటికి పంపాడు చందు

 

*************

 

ఆ రోజు కోసం ఆకాశం కూడా ఆతృతగా ఎదురుచూస్తోంది, మబ్బుల అడ్డు లేకుండా స్పష్టమైన నీలి రంగుతో ముస్తాబయ్యింది.చానా దూరం కెల్లి మన కాల్నీకొచ్చిన పబ్లిక్కి నమస్తే......అన్న గోవర్ధన్ పలకరింపుతో వేడుకలు ప్రారంభం కాగానే పతంగుల పోటీ అరుపులతో కాలనీ మిద్దెలు, మైదానం హోరెత్తిపోయాయి. చిరుతిళ్ల తోపుడు బళ్ళచీటీ వాలే బడే మౌజ్’, ‘తోతా పరి... సోనే కి చిడీ... బుల్ బుల్ కి బడీ’  అరుపులుతో మైదానం ఇంచుమించు నాంపల్లి నుమాయిష్లా ఉంది.

 

గన్ను పండుగ బట్టలు, కొత్త సరంజామాతో అలవాటైన చోట స్థిరపడ్డాడు. మిత్రులిద్దరు అక్కడికి చేరుకోగానే అతనికి కనిపించేంత దూరంలో వింత చరఖాతో, కట్టుడు పతంగ్తో నిలబడ్డారు. వారిని చూడగానే గన్ను హావభావాలు మారిపోయాయి, ఇక ఉండబట్టలేకఅరె మంచిగుంది తున్కల్, తున్కల్ పతంగ్, యాడికెల్లి ఎత్కొచ్చినవ్అని         వెటకరించాడు.  

 

మాతాన రేషన్ పైసల్లేవు, కష్టబడి మేమే జేస్కున్నంఅని సరైన చోట తగిలేలా జవాబు చెప్పాడు చందు

 

అట్లనా పెంచ్ల సూస్కుందంఅని గన్ను సవాలు విసరగానే, “రవి.. జర దూరం బోయి పతంగ్ ఇడ్వుఅని సయ్యన్నాడు   చందు. చుట్టూ మూగిన పిల్లలకి వీరి పోటీ ఆసక్తిగా మారింది.

 

చందు దారం పైకి లాగగానే పతంగ్ కాస్త ఎత్తుకి ఎగిరింది, అది చూసి ఇద్దరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాసేపు అటు, ఇటు తటపటాయించి, తలకిందులుగా తిరిగి నేలపై రాలిపోయింది. ఓపిగ్గా ఎన్ని సార్లు ప్రయత్నించినా అలానే  ఒరిగిపోయింది. కాస్త దగ్గరగా పరీక్షిస్తే మధ్యలో పెట్టిన వెదురుబద్ద బాగా మందంగా ఉండడం కారణమని తేలిపోయింది.

 

రాత్రి పతంగ్ చేసాకా ఎగురుతుందా, లేదా అని చూసుకునే సమయం మిగల్లేదు, ఇప్పుడు గన్ను అవమానం మాత్రం అలానే మిగిలింది. ఇంకా ఎండలో బ్రహ్మజెముడు ఆకులు తుంచుతున్నట్టే ఉంది. చందు చేతిలో ఎర్రటి రక్తపు గీతలు అలానే ఉన్నాయి. జీవితం ఒకరికి అతిగా వడ్డించిన విస్తరి, మరొకరికి ఖాళీ అతుకుల విస్తరి.

 

ఇష్టమైన పండుగ అంటే ఎల్లప్పుడూ ఊరించే వేడుక, పతంగ్ అంటే బట్టలు కొంటా అంటారు, పావలాతో పీచు మిఠాయి మాత్రం ఒస్తుంది... పాత విసుగులన్నీ రవి, చందులని ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఇంకో పక్క గోవర్ధన్ మాటలు హెచ్చు స్థాయిలో వినిపిస్తున్నాయిచిల్క శీను డీల్ వద్లుడు షురు జేసిండు... కాటే... ఇంకొక పతంగ్ కోసిండు... . ఎంత స్మూత్గ స్సాఫ్ జేసిండ్ర బై శీను... డీల్ అంటే మన చిల్క శీను..ఓల్డ్ సిటీల గిస్వంటి... ”  

 

ఆలోచనలు పూర్తిగా అలిసిపోవడంతో, బెంచీపై స్థిరపడి మౌనంగా పోటీలు చూస్తున్నారు, మాములుగా వేగంగా సాగే సమయం, ఆ రోజు మెల్లిగా సాగుతూ మిట్ట మధ్యాహ్నం దాకా చేర్చిందిఆకలైతుంది ఇక ఇంటికి బోతాఅని లేచాడు చందు.నువ్వు వెళ్ళిపోతే నేనేం చేస్తాఅని రవి కూడా లేచాడు. ఎదురుగా రేగిన జుట్టుతో ఎర్ర బస్తీ జిల్లయ్య కనపడ్డాడు, ఇంకో రోజు అయితే ఇద్దరికీ అనుమానం లేకుండా ఒణుకు పుట్టేది. కానీ ఈ రోజు వారు వేరే మనుషులు, ఏదో కోల్పోతామనే భయం ఇద్దరిలో లేదు. జిల్లయ్య చరఖా కోసమే వచ్చాడని, ఏ ఉపయోగం లేని వక్రపు చరఖా ఉంటే ఎంత, లేకపోతే ఎంతని అతని కళ్ళల్లోకి సూటిగా చూసారు.  

 

మిమ్లని పొద్దుమీకెల్లి  సూస్తున్న, చరఖా పట్కొని తిర్గుతున్నవ్, పతంగ్ లేదా?” అన్నాడు జిల్లయ్య  

 

అవును లేదు

 

ఎందుకు

 

కొననికె పైసల్లేవుఅన్నాడు చందు

 

మాతాన గూడ పైసల్ ఉండవు, గందుకే గోడల్ దుమ్కి... రోడ్లపై ఉర్కుర్కి పతంగుల్ పడ్తముఅని వెకిలిగా నవ్వాడు

 

చెయ్య ముందుకి చాస్తూనీకు చరఖా కావాలా?” అని అడిగాడు రవి

 

ఏ ఒద్దు నేనెమ్ జేస్తా గా ఫాల్తు చర్కాతోని... నువ్వే గీ పతంగ్ తీస్కో”  అని అందమైన డోరాదార్ రవి చేతిలో పెట్టాడు. రావణుడు అనుకుంటే రాముడిలా వరమిచ్చాడు, ఎందుకిచ్చాడో అర్థం కాలేదు, వాళ్ళూ అడగలేదు... ఎందుకంటే తెరుకునేసరికి అతను వెళ్ళిపోయాడు.

 

ఎందుకిచ్చాడో తెలుసా

 

ఖాలీగా చరఖా పట్కొని తిర్గుతుంటే పాపమని ఇచ్చిన్డెమోఅన్నాడు చందు

 

అందుకేనేమో వాళ్ళు మంచివాళ్ళే అంటుంది మా బామ్మఅన్నాడు రవి

 

జిల్లయ్య పోసిన జీవంతో ఇద్దరూ రెట్టించిన ఉత్సాహంగా మైదానంలోకి దిగారు, డోరాదార్ కపిరాజు జెండాలా రెప, రెపలాడుతూ వారిపై పోటీకొచ్చిన గన్ను పతంగ్ని వీరి ప్రమేయం లేకుండా తెగ్గొట్టింది. దారం చేతులు మార్చుకుంటూ ఇద్దరూ సంతోషం పంచుకుంటుంటే ఓ చిన్న కుర్రాడు వాళ్ళ దగ్గరకి వచ్చిగోవర్ధనన్న నీ పేరడిగిండుఅన్నాడు.

 

నా పేరు రవి, నా దోస్త్ చందుఅని చూపించగానే ఆ కుర్రాడు షామియానా వైపు పరిగెత్తాడు

 

కొత్త పొరగాల్లు రవి, చందు జీబా డోరాదార్ పిలాయిస్తున్రు, మస్తు షాన్దార్గుంది పతంగ్...గిప్పుడే ఒక పతంగ్ కోసిన్రు...గోవర్దన్ మాటలు ఇద్దరినీ లీలగా తాకుతున్నాయి...అప్పటికే వారు పరిభ్రమించే పరిధులు దాటి గమ్యం చేరుకున్నారు...అక్కడ పోటీలు, పోలికలు, ప్రశంసలు లేవు, కేవలం స్వేచ్ఛ ఉంది, స్ఫూర్తినిచ్చే ఊపిరి ఉంది. చందు బాషలోమస్తు మజా ఒచ్చింది”!!

 

 

*************

 

Friday, December 13, 2013

తాతయ్య మాష్టారు


పీ.డీ.కే.రావుగారిపై ప్రత్యేక శీర్షిక చదినప్పటినించీ ఆయన నన్ను వదిలిపెట్టలేదు, శీర్షికలో ఎన్నో కోణాలు నాలో ఇంకిపోయిన ప్రశ్నలకి జవాబులుగా అనిపిస్తూ కొత్త సందేహాలని లేవనెత్తాయి. సర్వత్రా స్వార్ధమొక అవసరపు గుణం, వనరులని వ్యర్ధపరచడమో విలాసమయిన రోజుల్లో, అవే అంశాలపై వారు సాధించిన ప్రజా విజయాలు ఆశ్చర్యంగా అనిపించాయి.

నన్నంతగా ప్రభావితం చేసిన రావుగారిని తేలిగ్గా వదలదల్చుకోలేదు.  సందేహలని నివృత్తి చేసుకుందుకు ఇండియా వెళ్ళి ఆయన్ని కలవాలని నిశ్చయించుకుని, మాట్లాడాలని గూగుల్లో ఎన్ని విధాల గాలించినా, సంసర్గ మార్గమేమీ దొరకలేదు. 'గూగులుంటే చాలు.. ప్రపంచం నా గుప్పిట్లో' అనే శోధనాహంకారానికి గండిపడింది, అయినా అతివిశ్వాసం కాకపోతే.నిర్వచనాలకందని వ్యక్తులు, సాదా సీదా సర్చిలకెలా దొరుకుతారు?

ప్రయత్నించగా, ప్రయత్నించగా ఓ డాలస్ సంస్థకి రావుగారు పరిచయమని తెలుసుకుని వారిని ఈమెయిలు, ఫోను నంబర్ అభ్యర్దిస్తే ‘డాక్టర్ రావ్ వాంట్స్ అనానిమిటీ ‘ అనే సమాధానమొచ్చింది, “అయ్యో నేను మంచివాడినండి” అనే లోపు ఫోన్ పెట్టేసారు. ఇక ఉన్న ఒకటే మార్గం... జిడ్డులా వెంబడిస్తే, నా తలనొప్పి భరించలేక ఫోను నంబర్ వారు ఇవ్వడం, రావుగారికి ఫోన్ చేసి కలవాలనే నా కోరికను చెప్పడం జరిగింది. నా ఇండియా  ప్రయాణానికి వీలు దొరకక .... ఎప్పటికో.... ఓ ఏడాదికి కుదిరింది, వెళ్ళేదాకా రావుగారు, నా సందేహాలు...ప్రతి నిత్యం తరుముతూనే ఉన్నాయి.

                                                                ****

అర్ధరాత్రి రెండిటికి రైలు కోసం ఎదురుచూస్తున్నాను, ప్లాట్ఫారంపై అలవాటులేని బోసితనం, స్టేషన్ చుట్టూతా చిక్కటి నల్లదనం అలుముకుంది, హోరు లేని స్పష్టత ఆదమరచిన కలతని తట్టి లేపింది...

చుట్టూ అగోచరమైన పంజరం.. ఊసల్లోంచి కనపడే, వినపడే నిజాలు వార్తా విశేషాలు మాత్రమే...అసమానతలు  కనపడవు, అరుపులు  వినపడవు, వినపడినా పట్టించుకోవడం నా పంజరపు నాగరికత కాదు, సమయాన్ని సద్వినియోగపరచడం అసలే కాదు. 
అపరాధ భావనలను కెరటాల ఆవలకి నెట్టి, నేను నా పంజరపూసలు లెక్కెడుతూ, అప్పుడప్పుడూ కొత్త రంగులు వేసి ఆనందిస్తాను.....భయపెట్టే వాస్తవానికి, అదేమిటో తెలియని అవిశ్రాంతికి మధ్య నేనో పావుని..... .రైలు కూత వినిపించడంతో ఆలోచనలు తమ చీకటి అరల్లోకి త్వర, త్వరగా సద్దుకున్నాయి.   

తెల్లారుతుండగా రైలు ఎక్కడో ఆగగానే, ఎదురుగా ఉన్న ప్రయాణికుడు విసుగు చూపిస్తూ మాటలు కలిపాడు

"విశాఖని పదేళ్ళుగా చూస్తున్నాను సార్, పొరపాటున.. ఒక్క రోజు కూడా టైంకి వెళ్ళిన పాపాన పోలేదు"
నేను నవ్వుతూ "తెలిసీ ఎందుకు సార్ విసుక్కోవడం?"
"అవుననుకోండి, ఈ రోజు చాలా తొందరలో ఉన్నాను, ప్రతీ నిముషం లెక్క పెట్టుకునే పరిస్థితి, అందుకే ఈ సణుగుడు"
"ఏమీ అనుకోకపోతే కారణం తెలుసుకోవచ్చా?"
"నేను ఆంధ్రాబ్యాంక్ చీపురుపల్లి బ్రాంచ్ మేనేజర్ని వారం క్రితం ట్రాన్స్ఫరయ్యింది...సామాన్లు లోడ్ చేసి ఫ్యామిలీతో సహా ఈ సాయంత్రమే బయలుదేరి వెళ్లిపోవాలి"
"అయితే చాలా టైట్గా ఉంది సార్ మీ ప్లానింగ్"
"అవునండి, మీరెక్కడి దాకా?"
"నేనూ చీపురుపల్లే వెళుతున్నాను, అక్కడ పీడీకే రావుగార్ని కలవాలి"
"గురువుగారి దగ్గరికా..,ఆయన మీకు ముందే పరిచయమా?"
"లేదండి, పేపర్లో ఓ ఆర్టికల్ చదివాను, చదివాకా కలవాలనిపించి...."
"వారి సంస్థ మా కస్టమరే, అలాంటి వారిని ఎక్కడా చూడలేదు, హి ఇస్ ఏ గ్రేట్ మాన్"
ఎదురుగా కూర్చున్న వ్యక్తి తాను రిటైర్డ్ హెడ్ మాస్టరని పరిచయం చేసుకుని సంభాషణలో పాలు పంచుకున్నారు

"వారు నాకు ఇరవయ్యేళ్ళుగా పరిచయం, ఈ మధ్యనే రిసర్వ్ బ్యాంకు సెంట్రల్ రూరల్ డెవలప్మెంట్ పానెల్లోకి తీసుకున్నారు, మీలాగే ఆయన్ని కలవడానికి పెద్ద, పెద్ద అధికారులు వస్తుంటారు, ‘ఇట్ విల్ బి ఏ లెర్నింగ్   ఎక్స్ పీరియన్స్ ఫర్ యు"

                                                                    ****

శోధన ఆఫీసు గోడలపై రమణ మహర్షి, వివేకానందుడు, నోమ్‌ చోమ్‌స్కీల సందేశాలు చిన్న బానేర్లపై అతికించబడ్డాయి, వాటిలో అమితంగా ఆకట్టుకున్నది 'తక్కువతో ఎక్కువ సాధించు' అనే విలువైన సూచన.

షెల్ఫ్ నిండా ఎన్నో ఆసక్తికరమైన పుస్తకాలు, గ్రంధాలు వరుసలో ఉన్నాయి, నా స్థాయికి తగ్గట్టుగా పేర్లు చదివి పొంగిపోతుంటే, అప్పుడే లోపలకొచ్చిన రావుగారు పలుకరించారు, నా కుటుంబ నేపధ్యం, అమెరికా ఉద్యోగాల్లాంటి మాటల్లో ఉండగా ఆఫీసులోకి ప్రవేశించన వ్యక్తిని పరిచయం చేసారు

"మా సంస్థ నిర్వహించే బాలబడులని కాసమయ్య చూసుకుంటారు, మీరు వచ్చిన రోజు చాలా మంచి రోజు, మా బడి పిల్లల స్వాతంత్రదినోత్సవ సందడి, మా ఊరు చూసి రండి" అని సాగనంపారు.

ఆ మాట్లాడిన సమయంలో రావుగారు మితబాషని, ఆయన సమక్షంలో సమస్యలు  కూడా తలవంచుకునే మృదుత్వం ఆయన నైజమని అర్ధమయ్యింది

****

కాసమయ్యతో కలిసి ఊరి ఎత్తు, పల్లాల్లో నడుస్తూ మాటల్లో పడ్డాను, అతను అడిగిన దానికి సమాధానం చెప్తున్నా నాకిదంతా నమ్మశక్యంగా లేదు, ఎక్కడో తెలియని చోట, తెలియని వారి మధ్య నా ఆనవాళ్ళు వెతుకుతున్న భావం.

"మాదొకప్పుడు అస్తవ్యస్తమైన ప్రాంతం, అప్పుల పాలై పొలాలు అమ్ముకున్న రైతులు, పూట గడవని రోజు కూలీలు, బాల కార్మికులు ఇక్కడి రోజూవారి నిజాలు, మా వెర్రి జనాలకి ప్రభుత్వం వెనకపడ్డ ప్రాంతానికిచ్చే రాయితీలేమిటో, పధకాలేమిటో, ఈ దేశ పౌరుడిగా కనీస హక్కులేమిటనే అనే జ్ఞానం లేక చాలా దుర్భర స్థితిలో బతికేవాళ్ళు, అలాంటి మా ప్రాంతానికి గురువుగారొచ్చి ఆత్మలా కలిసిపోయారు"

“రావుగారికి మీ ఊరితో ఏమైనా సంబంధముందా?"

"మన మధ్య నేల, నీరు, ఆకాశం లాంటి బంధాలుండగా, వేరే చుట్టరికం అవసరమా సార్"

"నా మాటని తప్పుగా అనుకోకండి, ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారని అడిగానంతే"

"గురువుగారు న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా అమెరికాలో పని చేసేవారు, మాతృదేశానికి తన అవసరం ఎక్కువుందని  మంచి కెరీర్, హోదా వదిలి ఇక్కడకొచ్చారు"

"మరి వారి కుటుంబం... "

"కుటుంబం స్వార్థ చింతన కలిగించి, ఆదర్శాలకు అవరోధం అవుతుందని బ్రహ్మచారిగా ఉండిపోయారు”

****

శుభ్రమైన ఆవరణలో పెద్ద పాక, పూల మొక్కలు, ఆట స్థలం పొందికగా అమర్చినట్టున్నాయి... లేత మొగ్గలను చూడగానే, చిరునవ్వులు వినగానే అది బాలబడని తెలిసింది.
"ఇది మా చాకలిపేట బాలబడి, ఏ బాదర బందీ, బస్తాలు మోసే అవసరం లేకుండా ఆటా, పాటలతో చదువు నేర్పడం ఇక్కడి సిద్ధాంతం” కాసమయ్య బాలబడిని పరిచయం చేసారు.
ఆ తర్వాత బాలబడి బుడతలని “పిల్లలూ!! కొత్త మాస్టారొచ్చారు మీరు నేర్చుకున్నవి చెప్పండి” అనగానే పోటీ పడి పిల్లలు పద్యాలు, పొదుపు కధలు, శ్లోకాలు వరుసలో నిలబడి ఉత్సాహంగా చెప్తుంటే, వారిలో చదువుని ఇష్టపడే స్వేచ్చ,  వారి పక్కనే నిలబడి ప్రోత్సహిస్తున్న టీచర్ల వాత్సల్యం ఊరటగా అనిపించాయి.

అందరి దగ్గర సెలవు తీసుకుని బయటపడి మాటల్లో పడ్డాము

“గురువుగారు రూపుదిద్దిన ఈ ఆదర్శ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 18 జిల్లాలలో అమలుపరిచింది, అమలు చెయ్యడానికి ఏటా సుమారు డెబ్బై వేల రూపాయల ఖర్చవుతుంది”

“ఒక ప్రీ-స్కూల్  విద్యార్థికి ఏభై వేల నుండి లక్ష రూపాయల దాకా ఫీసుతో ఏ మాత్రం పోలిక లేదు”

"వీరి తల్లి, తండ్రులు రోజు కూలీలు, తమ కుటుంబ స్థితి మెరుగుపర్చుకోవాలంటే పిల్లలకి చదువు చెప్పించడం చాలా అవసరమని ఇక్కడకి పిల్లల్ని ఇష్టంగా పంపుతారు, తమ శక్తికి తగ్గ సహాయ, సహకారాలని అందిస్తారు, ఇలా మా ఊరే కాదు చుట్టూ ఉన్న నలభై, ఏభై గ్రామాలలో గురువుగారు భాగస్వామ్య చైతన్యం తీసుకొచ్చారు"


“రావుగారు చాలా మృదుబాషిలా కనిపించారు, మరి ఇంత మార్పునెలా సాధించారు”

"ఆ మృదుత్వం వెనుక పరిస్థితులను మార్చాలన్న ఉక్కులాంటి సంకల్పముంది- అసమానతలని సమాధి చెయ్యాలని...చిన్నపిల్లల చిరునవ్వులు చూడాలని.... ఇది ఒక్క రోజు మార్పు కాదు,  ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం, ఎంతో సహనం, ఎన్నో ఒడిదుడుకులు... ఇరవై ఎనిమిది సార్లు తప్పుడు కేసులు పెట్టి, పోలీసు  ఎంక్వయిరీలు వేసారు, ప్రతీ సారి కేసు కొట్టేయాల్సి వచ్చింది”

“మీరు చాలా ఏళ్ళుగా సంస్థలో పనిచేస్తున్నారా?”

“ఇది నాకు పని కాదండి, పదో తరగతి ఫైలయ్యి ఏదో ఒక పని చూసుకుందాం అనుకున్న సమయంలో గురువుగారు పరిచయమయ్యారు, నిన్ను నేను చదివిస్తాను, రోజూ ఓ గంట పిల్లలకి పాఠాలు చెప్పాలి అన్నారు, అలా యెమ్.ఏ పూర్తి చేసాను.. పాఠాలు చెబ్తూనే ఉన్నాను, ఇంచుమించు మా శోధన కుటుంబ సభ్యులందరిదీ ఇదే నేపద్యం”

కాసమయ్య కాస్త దూరం నడిచాకా రోడ్డు పక్కగా ఉన్న రిక్షావారి కాలనీ చూపించాడు "గురువుగారు రిక్షా కార్మికులతో కలిసి ఏడేళ్ళ పాటు శాంతియుతంగా పోరాడి సాధించిన నేల, ఏ దళారీ లేకుండా సొంతంగా కట్టుకున్న ఇళ్ళు”

అడుగడుకీ శోధన సాధించిన ప్రజా విజయాలు కాసమయ్య చెప్తూనే ఉన్నాడు, చూపిస్తూనే ఉన్నాడు.

నా పంజరానికి, పట్టుదల పునాదులపై, సహనపు ఇటుకలు పేర్చి కట్టిన దృఢమైన కట్టడాలకి ఏ మాత్రం పోలిక కనపడలేదు..రావుగారు కూడబెట్టిన, కొల్లగొట్టలేని స్థిరాస్థులు.... ఆయన చుట్టూ ఉన్న వారిలో రేపటిపై గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసం అనిపించింది.

*****

రావుగారు స్వయంగా వంట చేసుకుంటారని ఆయన చేతి పులిహోర తింటున్నపుడు తెలిసింది, డెబ్బై మూడేళ్ళ ఏళ్ళ వయసులో అన్ని పనులు సొంతంగా చేసుకుంటారని, రూరల్ డెవలప్మెంట్ సమావేశాలకి పెద్ద నగరాలకి, బాలబడి పర్యవేక్షణకి ఏజెన్సీ ప్రాంతాలకి వెళ్ళే అలుపెరుగని శ్రామికుని పాదాలకి నమస్కరించి, చెమ్మగిల్లిన కళ్ళతో నా సందేహాలు అడిగాను  "మీరు కలిగించిన చైతన్యాన్ని చూసాకా ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను, మీరు అంత తేలిగ్గా అన్నీ ఎలా వదిలేసారో, ఓ చట్రంలో బతికే నాకు ఎన్ని సార్లు ఆలోచించినా అర్ధం కాలేదు"

"మధు గారు, నేను త్యాగం చేసాననుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకి వేసేవాడిని కాదు, ఇది నేను ప్రేమతో ఎంచుకున్న మార్గం. ప్రగతి పేరుతో మనం కొన్ని వర్గాలని వనరుల్లా ఉపయోగించుకుని, దూరంగా పెడుతున్నాము. మనం వాడే ప్రతి వస్తువు వెనక ఎన్నో చాలీ చాలని జీవితాలు, కన్నీళ్లు ఉంటాయి, వాటిని సరిదిద్దే భాధ్యత మనది.... అందులోనే నిజమైన దేశ ప్రగతని నా నమ్మకం"

"తప్పుగా అనుకోకండి మేధావులు వెనకుండి మార్పుని నిర్దేశిస్తారు కదా... మీరు ఇలా... ?"

"మన దేశానికి మేధావుల సలహాలు, ధనవంతుల చందాలు సరిపోవు, కావాల్సింది క్షేత్రస్థాయిలో గడపగలిగే నిబద్ధత, అలా గడిపితే కానీ ప్రజలు, వారి సమస్యల లోతు అర్ధంకావు, ఎంత గొప్పవారయినా అంతరీకరణ చేసుకుంటే తప్ప   తమ ఆలోచనలని  ఉపయోగపడేలా చెయ్యలేరు”

“హక్కుల పోరాటంలో మీకు బెదిరింపులు వచ్చేవని విన్నాను, మీకు భయం కలుగలేదా?”

“బెదిరింపులు వస్తూ ఉండేవి, నేను చాలా మొండివాడినని మా అమ్మ అంటూ ఉండేది, అప్పుడు అర్థమయ్యేది కాదు (ఆ మాటన్నపుడు చిన్న పిల్లవాడిలా అనిపించారు), నాకెప్పుడు ప్రజల మద్దతు ఉండేది, శాంతియుతంగా, న్యాయబద్ధమైన రీతిలో మా పోరాటం సాగేది...అందుకే ఓ కొలిక్కి రాడానికి అంతంత సమయం పట్టేది”

రావుగారు చెప్పింది తేలికగా అనిపించినా మౌలిక అంశాలపై అధికారంతో తలపడాలంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎంతో తెగువ, సత్తువ, ఆత్మబలం కావాలి, అది అతి కొందరికే సాధ్యమని నాకు తెలుసు. మరెన్నో సందేహాలకి వారి ఫిలసాఫికాల్ కాంనెస్లో జవాబులు దొరికాయి.

కొత్త స్నేహితులకి, రావుగారికి వీడ్కోలు చెప్పి  స్టేషన్కి బయలుదేరాను, అరుదైన అదృష్టాన్ని ప్రత్యక్షంగా కలిసిన ఆనందం, ప్రపంచాన్ని అసంతృప్తితో చూడకు, పాజిటివ్నెస్ మనతోనే మొదలవుతుంది, వాటిని చేతలుగా మార్చడం మనతోనే మొదలవుతుందనే బాధ్యత కలగలిపి నడుస్తున్నాను... నా ప్రయాణానికి ఇది ఆరంభమని, స్టేషన్లతో ఆగిపోయేది కాదని గట్టిగా అనిపించింది....దానికి తాతయ్య మాష్టారు కారణం.




*****