Koumudi, August 2015
రాత్రి భోరుమని వర్షం కురుస్తోంది, బాగ్లో బట్టలు ఒక్కొక్కటీ సర్దుకుంటూ రాధీకేసి చూస్తున్నాను, నన్ను పట్టించుకోనట్టు నటిస్తూ తన పని చేసుకుంటోంది. నేను సెస్కాచ్యువన్ వెళ్ళడం రాధికకి ఇష్టం లేదు, ఆ ఇష్టాన్ని అవుననే వెసులుబాటు నాకు లేదు. ప్రాజెక్ట్ పని మీద ప్రతి వారం సెస్కాచ్యువన్ వెళ్ళి రావడం తేలికైన విషయం కాదు, ఎంత లేదన్నా ఫ్లోరిడా నుండి పన్నెండు గంటల ప్రయాణం, పైగా శీతాకాలంలో విమానపు రాకపోకలు అస్తవ్యస్తంగా ఉంటాయని బెంగ పెట్టుకుంది. ప్రయాణం దగ్గరవగానే బెంగ మౌనంగా మారి మా మధ్య మూడో పాత్ర పోషిస్తోంది.
భుజం చుట్టూ చేతులు వేసి “రాధీ! నేను ఇష్టపడి వెళుతున్నానా?” అని జాలి మొహం పెట్టి అడిగాను.
పట్టు సడలించి “మీ సంగతి తెలీదు, చందు మాత్రం నిద్రలోంచి లేవగానే నాన్నా... నాన్నా.. అంటూ పక్క తడుముకుంటాడు. మీ షూస్, లాప్టాప్ వెతుక్కుని... అవును నాన్న మళ్ళీ వెళ్ళిపోయారు అని వాడికి వాడే సమాధానం చెప్పుకుంటాడు, అప్పుడు వాడి మోహం చూస్తే తెలుస్తుంది మీకు” అని జవాబు చెప్పింది రాధిక
“మీకు దూరంగా ఎందుకుండాలని ప్రశ్నించుకోని రోజు లేదు.. ట్రస్ట్ మి...ఇదే నా ఆఖరి కన్సల్టింగ్ అసైన్మెంట్, ఇది పూర్తవగానే ఎక్కడికీ వెళ్ళను, మనూళ్ళో పర్మనెంట్ ఉద్యోగం వెతుక్కుంటాను... సరేనా?" అన్నాను.
“ఇన్ని రోజులూ అమెరికాలో తిరుతుంటే ఏదో దగ్గరగా ఉన్నారనిపించేది. ఈసారి అక్కడెక్కడికో వెళుతున్నారు, బాగా శ్రమ పడతారేమో ఆలోచించుకోండి”
“ఆలోచనలు అయ్యాయి, అవమానాలు అయ్యాయి....ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూ లో మానేజ్మెంట్ చెయ్యగలనంటే...ఇంతక మునుపు చేసావా? ఎక్కడ చేసావు? రెఫరెన్స్ ఇవ్వగలవా? అని అనుమానించారు తప్ప మాటకి విలువివ్వలేదు. ఈ అవకాశం లేక, లేక వచ్చింది అందుకే కెనడా అయినా మారు మాట్టాడకుండా ఒప్పుకున్నాను”
"నేను ఉద్యోగం గురించి కాదు, మీ గురించి మాట్లాడుతున్నాను"
“నేను మన గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న స్కిల్స్ తో పర్మనెంట్ ఉద్యోగంలో జేరితే జీతం బొటాబొటిగా సరిపోతుంది, మన అవసరాలు తీరాలంటే కనీసం మానేజ్మెంట్లో చేరాలి, అందుకే ఈ డెస్పరేషన్”
“సర్లెండి...ప్రతి మాటకి ఏదో ఒక లింకు పెడతారు, మీరు మాత్రం హైరానా పడకండి”
“నేను హైరానా పడను, నువ్వు కంగారు పడకు. నవ్వనంటే మరొక్క విషయం, పొద్దున్నే లేచి సాగనంపకు నాకేదో గిల్టీగా ఉంటుంది" అని నచ్చ చెప్పాను.
మూడున్నరకి అలారం మ్రోగగానే నవ్వొచ్చింది, కలత నిద్రకి మ్రోతల అవసరం లేదు, రాత్రంతా నాలో నేను తగువు పడుతూనే ఉన్నాను, అస్థిరత్వపు నీడల వెనుక బలవంతపు నడకని ద్వేషిస్తూనే ఉన్నాను, నడుస్తూనే ఉన్నాను.
మళ్ళీ అదే చీకటి, అవే నిశ్శబ్ద ఘడియలు. లాప్టాప్ బాగ్, స్ట్రోలర్, నేను అంతా ఒకేసారి ఇంటి బయటపడ్డాము, వీధి మౌన ముద్రలో ఉంది, ఎదురుగా వరుసలో పేర్చిన సోలార్ దీపాలు అమావాస్య చీకటిని పారదోలడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్నాయి, నాలోని ప్రాక్టికాలిటీ ఇంచుమించు అలాంటి యుద్ధమే చేస్తూ నడిపిస్తోంది.
*********
సగం దూరం డెన్వర్ చేరుకునేసరికి కనెక్టింగ్ ఫ్లైట్ ఆలస్యమని తెలిసింది. వాతావరణం మెరుగుపడి ఫ్లైట్ బయలుదేరుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాను. గంటలు గడిచాయి, చీకటి పడింది. నమ్మకం వదిలేసుకున్న ప్రయాణికులు అక్కడక్కడ కుర్చీలలో సర్దుకుని, సామాన్లు తలకింద పెట్టుకుని రక, రకాల భంగిమలలో పడుకుంటున్నారు, నిద్రని కంటి రెప్పలపై మోస్తూ ఎయిర్లైన్ డెస్క్ వైపు చూస్తుంటే నా ఇంటర్వ్యూ గుర్తొచ్చింది.
“ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి నువ్వు సరైన వ్యక్తివని ఎలా అనుకుంటున్నావు” డైరెక్టర్ గొంతులో కాస్త అపనమ్మకం, బోలెడు అసహనం స్పష్టంగా తెలుస్తోంది.
“మీ రిక్వైర్మెంట్స్ బాగా అర్థం చేసుకున్నాను, వాటికి నా స్కిల్స్ సరిగ్గా సరిపోతాయని నమ్మకముంది”
“మా టైం లైన్స్ చాలా టైట్ గా ఉంటాయి. వారానికి అరవై, డెబ్బై గంటల సమయం ప్రాజెక్టుపై పెట్టాలి, మీకు ఓకేనా?”
“నేను వాచీ చూసి పని చెయ్యను, పనయ్యాకా వాచీ చూసుకుంటాను" అని నొక్కి చెప్పాను.
“గుడ్, నేను అప్ ఫ్రంట్ చెబుతున్నాను. ఇది చాలా కష్టమైన ప్రాజెక్టు, చిన్న టీంతో పని చేయించాలి. ఇది వరకో పేరు మోసిన గ్లోబల్ కంపెనీ నాలుగు నెలలు ప్రయత్నించి చెయ్యలేక చెయ్యెత్తేసింది”
“మీకు నా రెస్యుం చూస్తే అర్థమవుతుంది, నేను ఇప్పటిదాకా పని చేసిన ప్రతి ప్రాజెక్టు ప్రెషర్ కుక్కర్ లాంటిదే.. అసలు సులువనే మాటతో నాకు పరిచయం లేదు” మానేజ్మెంట్ రోల్ కావాలన్న ఆత్రుత పైకి తెలియకూడదనుకున్నా మాటలు అదుపు తప్పి దొర్లిపోతున్నాయి
“ఆఖరి విషయం, మీరు రిసోర్సెస్తో గట్టిగా పని చేయించాలి, చేయించగలరా?”
“తప్పకుండా, యువర్ సక్సెస్ ఇస్ మై ప్రయారిటీ” అని ముగించాను.
నా జవాబులు నచ్చి తీసుకున్నారో లేక మారుమూల ప్రాంతానికి ఎవరూ రాక తీసుకున్నారో తెలీదు కానీ మొత్తానికి అవకాశం దొరికింది.
టెర్మినల్ పలచబడుతుంటే ఎయిర్లైన్ డెస్క్ దగ్గరకి వెళ్లి “ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అని అడిగాను, అప్పటికి బహుశా మూడో సారి అడిగి ఉంటాను. నాలా ఎందరికో జవాబు చెప్పి, చెప్పి విసిగిపోయారేమో “పొద్దున్న దాకా ఏమీ చెప్పలేము” అని కాస్త చిరాగ్గా చెప్పారు. ఆ నిముషం నిస్సత్తువ ఒక్కసారిగా ఆవరించింది, వెంటనే దగ్గరగా ఓ ఖాళీ కుర్చీ వెతుక్కుని చతికిలపడ్డాను. పరుగు పందాలు అలవాటయిన శరీరానికి తీరుబడిగా కూర్చోవడం కాస్త కొత్తగా, గాలిలో తేలుతున్నట్టుంది.
ఎదురుగా రన్వే ఎడ్జ్ లైట్లు మిణుకు, మిణుకుమంటూ మెరుస్తున్నాయి, ఆ కాంతిలో మంచు కరుగుతూ కనపడుతోంది, వాతావరణమిచ్చిన తెరిపికి ఒక ఫ్లైట్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కదులుతోంది. నాకంతటి అదృష్టం లేదు, నా రన్వే నిండా అస్పష్టత, సంపాదన పరుగులో ఖర్చవుతున్న జీవితం కనిపిస్తోంది. పాకుడు రాళ్ళపై పట్టు కోసం నా ప్రయత్నం కనిపిస్తోంది...సీనే మే జలన్.. ఆన్ఖోన్ మే తుఫాన్స క్యోన్ హై...గొంతు దాటని భావాలకి మ్యూజిక్ ప్లేయర్ వంత పాడింది.
ఈ అలజడికి రాధికతో మాట్లాడడం విరుగుడు అనిపించి సెల్ తీసి చూస్తే ఛార్జ్ అయిపొయింది. లాప్టాప్ బాగ్ వెతికినా చార్జర్ దొరకలేదు, ప్రయాణం హడావిడిలో పెట్టుకోవడం మర్చిపోయాను. నాకు రాధిక సంగతి తెలుసు, ఫోన్ చేసి పరిస్థితి చెప్పకపోతే కంగారు పడుతూ, మేలుకుని ఉంటుంది. ఏమీ పాలుపోక చుట్టూ చూసాను, కాస్త దూరంలో ఓ స్త్రీ బహుశా ముప్పై, ముప్పై అయిదేళ్ళు ఉంటాయేమో ఫోన్లో మాట్లాడుతోంది, కాస్త వీలు దొరకగానే దూకినంత పని చేసి దగ్గరకి వెళ్ళాను.
“ఎక్స్ క్యూస్ మి! మీరేమీ అనుకోపోతే ఓ సహాయం కావాలి” అని అడిగాను
“చెప్పండి”
“నా సెల్ ఛార్జ్ అయిపొయింది, చార్జర్ కూడా మర్చిపోయాను”
“ఒకే”
“నా కాల్ కోసం మా ఆవిడ ఎదురుచూస్తూ ఉంటుంది, మీరు చార్జర్ ఇచ్చినా లేక ఓ రెండు నిముషాలు సెల్ ఇచ్చినా చాలా సహాయం చేసినవారవుతారు” అన్నాను, నా మాటకి మొదట మొహం ఇబ్బందిగా పెట్టింది, తర్వాత ఏమనుకుందో చార్జర్ తీసిచ్చింది.
రాధికతో మాట్లాడాకా చార్జర్ తిరిగి ఇస్తూ “చాలా, చాలా థాంక్స్.. బై ది వే, నా పేరు శశాంక్”
"నా పేరు మేరీ," కరచాలనానికి చెయ్యి అందించింది.
"నేను సెస్కాచ్యువన్ వెళుతున్నాను, అక్కడ టైటాన్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్గా రేపు జేరుతున్నాను. పొద్దున్న రిపోర్ట్ చేసి తీరాలని షరతు పెట్టారు. నేనేమో ఇక్కడిలా చిక్కడిపోయాను" అని బలహీనంగా నవ్వి చేయి కలిపాను.
ఆవిడ కళ్ళలో ఒక ఆశ్చర్యపు మెరుపు.
"నిజమా? భలే కోయిన్సిడెన్స్. నేనూ అదే ప్రాజెక్టుకి సిస్టం ఆర్కిటెక్ట్ గా వెళుతున్నాను, అంటే మీరు నా బాస్, ఇది మొదటి టీం మీటింగన్న మాట" అని నవ్వింది. నేనూ నవ్వాను, ఆ క్షణం మేరీ వల్ల నా జీవితం పెద్ద మలుపు తిరుగుతుందని నాకు తెలియదు.
*********
ప్రాజెక్ట్ లో చేరి మూడు నెలలు గడిచింది, రోజూ పని ముగించుకుని రాత్రి హోటల్ చేరాకా రాధీ, చందులతో వీడియో సంభాషణలు చేసి మీ పక్కనే ఉన్నానని మాయ చేసేవాడిని. కంప్యూటర్ మూయగానే అగాధమయిన వెలితి తోడుగా మిగిలేది. ప్రతి వారం ఇంటికి వెళ్ళే వీలుపడక రెండు, మూడు వారాలకోసారి వెళ్ళేవాడిని. వీడ్కోలు చెప్పే రోజు మాత్రం శరీరంలో ఒక భాగం తీసినట్టుగా, ఎయిర్పోర్ట్ ఆ పాపం మూటగట్టుకున్న ఆపరేషన్ ధియేటర్లా అనిపించేది. అప్పుడు రాబోయే రోజులని మంచి రోజులుగా తలుచుకుని ఓదార్పు పొందేవాడిని.
సాస్కటూన్లో ప్రకృతి వెలుతురు చాలా తక్కువ సార్లు చూసాను, ఎక్కువ భాగం కాన్ఫరెన్స్ రూం లైట్ల కింద దీపపు పురుగులా గడిపేవాడిని. ఇంటర్వ్యూలో చెప్పినదానికంటే పని ఎన్నో రెట్లు కష్టంగా ఉండడంతో డైరెక్టర్ మితబాషని అర్థమయ్యింది. కొత్త అనుభవమయినా టీంని బాగా మానేజ్ చేస్తున్నాను, సమయానికి డెలివరబుల్స్ అందజేస్తున్నానని నమ్మకం కలిగింది.
ఆ రోజు స్టేటస్ మీటింగ్లో టీం లీడ్ కాస్త ఇబ్బందిగా కనపడ్డాడు, ప్రాజెక్ట్ మేనేజర్గా అపశకునాలని కనిపెట్టడం నా బాధ్యత కాబట్టి ముందుగా అతన్ని పలకరించాను
“డేవిడ్ కాస్త నెర్వస్గా కనపడుతున్నావు, ఏమిటి ప్రాబ్లం?"
“శషాంక్..డిజైన్ ముగిసి వారం రోజులయ్యింది, ఆ రోజు నుండి ప్రోటోటైప్కి సిస్టం కావాలని అడుగుతున్నాము”
“మేరీతో మాట్లాడావా?”
“మాట్లాడాను కానీ సరైన జవాబు లేదు, ఇలా ఇంకో మూడు రోజులు గడిస్తే ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ మార్చాలి”
“మానేజ్మెంట్కి ప్రాజెక్టుపై నమ్మకం తక్కువ, డెడ్ లైన్ మార్చమని అడిగితే అందరినీ ఇంటికి పంపించేస్తారు”
“ఇప్పుడు మేమేం చెయ్యాలి?”
“మీరు వేరే పనులు చూసుకోండి, నేను మేరీతో మాట్లాడి ఏ విషయమో ఇంకో రెండు గంటల్లో చెప్తాను, డోంట్ పానిక్” అని భరోసా ఇచ్చి పంపాను
మేరీ టీం మీటింగ్కి రాకపోవడం ఇది మొదటిసారి కాదు, గత నాలుగు వారాలుగా ఇదే తంతు. ఎప్పుడూ సెల్లో మాట్లాడుతూ ఆఫీసు బయట కనిపిస్తుందని, కంట నీరు పెట్టుకుంది....బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అని రకరకాల మాటలు విన్నాను. నాకు వ్యక్తిగత విషయాలతో సంబంధం లేదు, ఆ వైఖరి టీంకి పాకుతుందని నా భయం. ఆవిడ విషయం పైదాకా పాకి, డైరెక్టర్ తో అత్యవసర మీటింగుగా మారింది.
“సిస్టం డెలివరబుల్స్ రెడ్లో ఉన్నాయి, కారణం తెలుసుకోవచ్చా?” అని అడిగాడు జాక్
“కారణం తెలుసు, పూర్తి వివరాలు కనుక్కుని మీకు సాయంత్రం లోగా చెప్తాను” అన్నాను
“శశాంక్! మీరు కష్టపడితే సరిపోదు, టీంని అదుపులో పెట్టాలి. ఎవరైనా సరిగ్గా సహకరించకపోతే ఫైర్ చేసే అధికారం మీకుంది”
“ఇప్పటిదాకా ఆర్కిటెక్ట్ ఇచ్చిన సిస్టం కన్సిడరేషన్స్ చాలా బావున్నాయి, ఎకనామికల్గా ఉన్నాయి. మంచి అనుభవం ఉన్న ప్రొఫెషనల్. ఎటొచ్చి ఆవిడతో సమస్యల్లా కమ్యూనికేషన్, నేను మాట్లాడి సరి దిద్దుతాను” అని సంజాయిషీ ఇచ్చాను.
“మనం మనుషుల్ని అర్ధం చేసుకుని, వారిని చక్కదిద్దేంత సమయం లేదు. కాంట్రాక్టర్లని నోటిస్ లేకుండా ఫైర్ చెయ్యొచ్చు, జస్ట్ త్రో దెం” అని మండిపడ్డాడు.
“మీరు చెప్పింది నిజమే కానీ మనకి అంత సులువుగా దొరికే స్కిల్ కాదు. పైగా మనకంత సమయం లేదు, నేనే ఏదోలా సరిదిద్దుతాను” అని బయట పడ్డాను.
డైరెక్టర్ మనుషుల్ని పెన్సిల్, ఇరేసర్లాగ మాట్లాడడం, కాంట్రాక్టర్ అంటే ఫైర్ చెయ్యడానికి వెసులుబాటులా మాట్లాడడం నచ్చలేదు. నా లక్ష్యం చేరుకోవాలంటే సున్నితమైన ఆలోచనలని ప్రాక్టికాలిటీ అనే ఇనుప తెర వెనుకకు నెట్టడం తప్పదని నిశ్చయించుకున్నాను. క్యూబ్కి వెళ్లి చూసినా, కారిడార్లో వెతికినా మేరీ కనపడలేదు. చివరకి కెఫీటేరియాలో ఓ మూల సెల్ పట్టుకుని విచారంగా కనపడింది.
“హలో మేరీ... మీతో ఒక అర్జంట్ విషయం మాట్లాడాలని అన్ని చోట్లా వెతుకుతున్నాను”
“శశాంక్! ఇంటి నుంచి అర్జెంటుగా కాల్ చెయ్యమని మెసేజ్ వచ్చింది..... డాక్టర్....” అని ఏదో చెప్పబోతుంటే మధ్యలో అడ్డుపడ్డాను.
“సారీ టు ఇంటరప్ట్.... అందరికీ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. నా మటుకు నేను కుటుంబానికి దూరంగా ఉంటున్నా ఆఫీస్ సమయంలో పని మాత్రమే చేస్తాను. బయట కాల్స్ తీసుకోను, కాల్స్ చెయ్యను. మీ వల్ల పని ఆగిపోయిందని టీం నుండి కంప్లైంట్లు వస్తున్నాయి”
“ఎన్విరాన్మెంట్ ఆలస్యానికి నేను కారణం కాదు, డాటాబేస్ ఇష్యూస్ కారణం. నిన్న అర్థరాత్రి దాకా ఆ టీంతో పనిచేసాను” అని చెప్పింది.
“ఆ స్టేటస్ ఏదో మీ దగ్గర దాచుకోకండి, కాస్త అందరితో పంచుకోండి” అని వెటకారంగా అన్నాను, ఏదో సమాధానం చెప్పబోతూ మధ్యలో ఆగిపోయింది.
“చూడు మేరీ! జాక్ కొత్త కన్సల్టెంట్ని తెచ్చుకోమని ప్రతీ మీటింగ్లో చెప్తున్నాడు. నేను మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను...ప్లీజ్ హెల్ప్ మి టు హెల్ప్ యు” అని సున్నితంగా హెచ్చరించి ముగించాను. నొప్పించే విధంగా మాట్లాడడం అలవాటు లేకపోవడం వలన కాస్త ఇబ్బందిగా అనిపించినా నాకు వేరే దారి లేదు.
*********
వీకెండ్ సెస్కాచ్యువన్ వదిలి ఇంటికొచ్చినా సెస్కాచ్యువన్ నన్ను వెంటాడుతూనే ఉంది. రాధిక పలకరింపుల వెచ్చదనం, కిటికీలోంచి వీస్తున్న చిరుగాలులు తాకుతున్నా స్పందించే అవకాశం లేదు, సెద తీర్చుకునే సమయం లేదు, అసలు ఇంటికి ఎందుకొచ్చానా అనిపించేది. చీకటి గుహ అలవాటయిన ప్రాణానికి వెలుతురు వింతగా, భయంగా ఉంటుంది.
ఆ రోజు “నాన్నా! నాన్నా! లాప్టాప్ పక్కన పెట్టు, మనం బాస్కెట్బాల్ ఆడదాము” అని చందు వెనకాల పడ్డాడు
“లేదురా ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది, సాయంత్రం ఆడదాం” అని కాస్త నొక్కి చెప్పాను
“నో ఇప్పులే ఆడాలి” అని పెంకిగా చెయ్య లాగాడు, ఆ అదురుకి మౌస్, లాప్టాప్ కింద పడ్డాయి. ఇక నా కోపం అదుపుతప్పింది
“గెట్ అవుట్” అని గట్టిగా అరిచాను
వాడు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్ళిపోయాడు. ఆ ఏడుపు వినగానే పని మత్తు దిగిపోయింది. చాలా తప్పు చేసాననిపించింది. రెండు వారాలకోసారి ఇంటికి వస్తాను, రోజున్నర ఇంట్లో ఉంటాను, నన్ను ప్రతి నిముషం మిస్సవుతాడు కాబట్టి నాతో గడుపుదామని అనుకుంటాడు, నేనేమో ఇలా...?
అప్పుడే రూమ్లోకి అడుగుపెట్టిన రాధిక “మీరు చాలా మూడీగా అయిపోయారు” అంది
“రాధీ! ఐ యాం రియల్లీ సారీ, ఈ ప్రాజెక్ట్ నా పర్సనాలిటీ మార్చేస్తోంది. ప్లీస్ ఒక్కసారి చందుని పిలువు” అన్నాను.
“వాడి విషయం పట్టించుకోకండి, కార్టూన్ ఛానెల్ పెడితే నిముషంలో మర్చిపోతాడు” అంది రాధిక
“షెడ్యూల్, బడ్జెట్లు చాలా టైట్గా ఉన్నాయి, డైరెక్టర్కి గంట, గంటకి స్టేటస్ చెప్పాలి. వీటికి సాయం మేరీ అనే సిస్టం ఆర్కిటెక్ట్ పెద్ద న్యూసెన్స్ గా మారింది, అస్సలు కమ్యూనికేట్ చెయ్యదు.... మాట్లాడదామంటే మనిషి కనపడదు. మొన్న ఉన్న పళాన రెండు రోజులు మాయమయ్యింది. అస్సలు టైం లేదురా దేవుడా అంటే ఆవిడని కంటికి రెప్పలా కనిపెట్టుకుని పని చేయించుకోవాలి, ఇవన్నీ తెలుసుకుని జాక్ ఆవిడని ఫైర్ చెయ్యమంటాడు”
“మీరు బాగా నలిగిపోతున్నారు, జాక్ చెప్పినట్టు చెయ్యొచ్చు కదా”
“ఆయనకేం.... ఏదైనా చెప్తాడు, ఇప్పుడున్న షెడ్యూల్కి కొత్త కన్సల్టెంట్ని తీసుకునేంత అవకాశం లేదు. ఆ మారుమూల ఊరికి నాలాంటి తల మాసినవాడు తప్ప ఎవ్వడూ రాడు.. అందుకే భరిస్తున్నాను” అన్నాను.
*********
రోజు మొదలయ్యకా జాక్ నా క్యూబ్ చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసాడు. వచ్చిన ప్రతీ సారి మైగ్రేషన్ షెడ్యూల్ రెడీనా... రెడీనా? అని అడిగి వెళ్ళాడు. ఇంకో పది సార్లు అడిగినా నా దగ్గర జవాబు లేదు. వీకెండ్ లోపు షెడ్యూల్ పంపుతానని చెప్పి వెళ్ళిన మేరీ ఇచ్చిన మాట నిలుపుకోలేదు, పొద్దున్న ఏడింటికి రావలసిన మనిషి మధ్యాహ్నం రెండయినా అడ్రస్ లేదు.
“ఇంకో గంటలో స్టీరింగ్ కమిటీ మీటింగ్. మైగ్రేషన్ వివరాలు లేకుండా వెళితే, ఎప్పుడేమి చేస్తారో తెలియకుండా ప్రాజెక్టుని భలే మిస్టీరియస్గా మేనేజ్ చేస్తున్నామని గ్రిల్ చేస్తారు. అసలే గో, నోగో అని నిర్ణయించే లీడర్షిప్ మీటింగ్....వుయ్ నీడ్ దట్ డామ్ డాక్యుమెంట్....!” అని అరిచినంత పని చేసి వెళ్ళాడు జాక్.
ప్రాజెక్ట్ నోగో అని నిర్ణయిస్తే నా కష్టమంతా ఆవిరయిపోతుంది. అసలు తప్పంతా నాదే, మేరీని తీసెయ్యమని జాక్ ఎన్నో సార్లు చెప్పాడు, నేనే చేతకాని వాడిలా నాన్చాను. నా మూలంగా నేను కూరుకుపోతున్నాను. మానేజ్మెంట్ అనుభవం, అద్భుతమైన రెఫరెన్సులు....ఇంటి పక్క ఉద్యోగం అన్నీ పేక మేడల్లా కుప్ప కూలిపోతున్నాయి.
నా కోపం అదుపు తప్పింది, రేపు ప్రాజెక్ట్ ఉంటుందా, ఊడుతుందా అనేది ఇక అనవసరం, ఆ రోజు హోదాలో మేరీకి మెయిలు చెయ్యడం మొదలుపెట్టాను - “మైగ్రేషన్ షెడ్యూల్ కోసం మిమ్మల్ని చేరడానికి శత విధాల ప్రయత్నం చేసాను. నా ఫోనుకి, ఈమెయిలుకి జవాబు లేదు. మీ నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రాజెక్ట్ పెద్ద రిస్కులో పడింది. ఈ నేపథ్యంతో మిమ్మల్ని తీసివేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది” వాక్యాలు రెండు, మూడు సార్లు తృప్తిగా చదువుకున్నాను. పంపే ముందు చివరిసారి తప్పులు సరి చూసుకుంటుంటే చాట్ మేసేన్జర్లో మేరీ ప్రత్యక్షమయ్యింది.
గొంతు చించుకుని అరవాలనిపించింది, అయినా సహనం నటిస్తూ “హై మేరీ” అని పలుకరించాను
“శశాంక్! ఐ యామ్ సారీ, ఈ రోజు...ఐ మీన్ ఇక సెస్కాచ్యువన్ రావడం వీలుపడదు”
“థాంక్స్! కనీసం ఇప్పుడైనా చెప్పారు, కారణం తెలుసుకోవచ్చా?” అని వ్యంగ్యంగా అడిగాను.
“రాత్రి జాన్.. నా హస్బెండ్ హాస్పిటలైజ్ అయ్యారు”
“అయ్యో! హోప్ హి ఇస్ ఫైన్ నౌ?” అని పొడి, పొడిగా అడిగాను.
"అదే మాట మా పిల్లలు అడుగుతున్నారు, నా దగ్గర జవాబు లేదు”
అర్ధం కాక "ఎందుకు?" అని అడిగాను.
“జాన్ కాన్సర్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నారు"
అవి మాటలయితే మరో మారు అడిగేవాడిని కాని అవి అక్షరాలు, స్పష్టమైన అక్షరాలు, ఎన్ని సార్లు చదివినా మారని అక్షరాలు. ఆ క్షణం వాస్తవం పొరలు, పొరలుగా విడిపోతూ ఒక దృశ్యం కళ్ళ ముందు నిలిపింది. చిక్కి శల్యమైన భర్త, బాధని దిగమింగుకుని పిల్లలని ఓదారుస్తున్న భార్య.. నేను ఊహించని దృశ్యం. అంత వరకు ప్రాజెక్ట్ చుట్టూ తిరిగిన గాజు ప్రపంచం ముక్కలు, ముక్కలుగా పగిలి కళ్ళు చెమ్మగిల్లాయి.
“వీకెండ్ మైగ్రేషన్ షెడ్యూల్ పంపాలనుకుని ప్రయత్నించాను కానీ వీలు పడలేదు, ఇప్పుడే మీకు మెయిల్ చేసాను” అంది మేరీ.
అనంతమైన విషాదాన్ని గుండెకి అదుముకుని, అలుముకున్న చీకట్లలో ఎలా నడుస్తున్నావని... టైపు చెయ్యాలని ఉంది, కానీ వణికే వేళ్ళు సహకరించలేదు.
“శశాంక్...పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా హెల్త్ ఇన్సురెన్స్ కోసం ప్రాజెక్ట్ తీసుకోక తప్పలేదు. రోజూ ఫోన్లో పిల్లలకి, భర్తకి ధైర్యం చెప్పాల్సి వచ్చేది, మనసు బాగోలేక సక్రమంగా కమ్యూనికేట్ చెయ్యలేకపోయేదాన్ని”
ఏదో చెప్పాలని మేరీ ఎన్నో సార్లు ప్రయత్నించింది, నేను అవకాశం ఇవ్వలేదు. అయినా నడిచే పనిముట్లతో మాటలేమిటి? నా లోకంలో అంతా వేగంగా, యాంత్రికంగా లక్ష్యం వైపు చేరిపోవాలి. వృత్తిపరంగా అదేం తప్పు కాదు. నా ఆలోచనలు రెండు భాగాలుగా విడిపోయాయి.
“....ఎన్ని ఇబ్బందులు పడ్డా మీరు నా పట్ల చాలా ఓర్పుగా ఉన్నారు, ఐ యామ్ గ్రేట్ఫుల్ టు యు”
“నేను ఓర్పుగా లేను.. భరించాను” అని చెప్పాలనుకున్నాను.
“ఏవైనా ప్రాజెక్టు ఇన్ఫర్మేషన్ కావలిస్తే చెప్పండి, వీలు చూసుకుని పంపుతాను” అంది.
“మేరీ! ఇంత ఒడిదుడుకుల్లో ఉన్నారని తెలియక మీ పై చాలా వత్తిడి పెట్టాను, ఐ యాం సారీ. మీ సమయం ఈ ప్రాజెక్ట్ కంటే ఎన్నో రెట్లు విలువైనది..ప్లీస్ టేక్ కేర్ అఫ్ యువర్ ఫామిలీ” అని భారమైన మనసుతో ముగించాను.
మైగ్రేషన్ డాక్యుమెంట్లు ప్రింట్ అవుట్లు తీసి డైరెక్టర్ టేబుల్ పైన పెట్టాను, వాటిని చేతిలోకి తీసుకుని నాకేసి ప్రశ్నార్ధకంగా చూసాడు.
“జాక్! దిస్ ఇస్ మై ఫైనల్ డెలివెరబుల్.“ అని చెప్పి నా సామాన్లతో ఆఫీసు బయటకి నడిచాను. జాక్ అంటున్న మాటలు లీలగా చెవిని తాకుతున్నాయి కానీ పట్టించుకునే అవసరం నాకు లేదు.
ఇనుప తెరల వెనుక దాగుడు మూతలు నాకు సరిపడవు, పనిని రాబట్టే యంత్రంలా కాదు మనిషిగా మిగలాలని ఉంది, అందుకే నడుస్తున్నాను, నా దారి నేనే సృష్టించుకుందుకు నడుస్తున్నాను...ఎదురుగా ఎయిర్పోర్ట్ మొదటిసారి ఆహ్వానిస్తూ కనపడింది
*********