పీ.డీ.కే.రావుగారిపై ప్రత్యేక శీర్షిక చదినప్పటినించీ ఆయన నన్ను వదిలిపెట్టలేదు, శీర్షికలో ఎన్నో కోణాలు నాలో ఇంకిపోయిన ప్రశ్నలకి జవాబులుగా అనిపిస్తూ కొత్త సందేహాలని లేవనెత్తాయి. సర్వత్రా స్వార్ధమొక అవసరపు గుణం, వనరులని వ్యర్ధపరచడమో విలాసమయిన రోజుల్లో, అవే అంశాలపై వారు సాధించిన ప్రజా విజయాలు ఆశ్చర్యంగా అనిపించాయి.
నన్నంతగా ప్రభావితం చేసిన రావుగారిని తేలిగ్గా వదలదల్చుకోలేదు. సందేహలని నివృత్తి చేసుకుందుకు ఇండియా వెళ్ళి ఆయన్ని కలవాలని నిశ్చయించుకుని, మాట్లాడాలని గూగుల్లో ఎన్ని విధాల గాలించినా, సంసర్గ మార్గమేమీ దొరకలేదు. 'గూగులుంటే చాలు.. ప్రపంచం నా గుప్పిట్లో' అనే శోధనాహంకారానికి గండిపడింది, అయినా అతివిశ్వాసం కాకపోతే.నిర్వచనాలకందని వ్యక్తులు, సాదా సీదా సర్చిలకెలా దొరుకుతారు?
ప్రయత్నించగా, ప్రయత్నించగా ఓ డాలస్ సంస్థకి రావుగారు పరిచయమని తెలుసుకుని వారిని ఈమెయిలు, ఫోను నంబర్ అభ్యర్దిస్తే ‘డాక్టర్ రావ్ వాంట్స్ అనానిమిటీ ‘ అనే సమాధానమొచ్చింది, “అయ్యో నేను మంచివాడినండి” అనే లోపు ఫోన్ పెట్టేసారు. ఇక ఉన్న ఒకటే మార్గం... జిడ్డులా వెంబడిస్తే, నా తలనొప్పి భరించలేక ఫోను నంబర్ వారు ఇవ్వడం, రావుగారికి ఫోన్ చేసి కలవాలనే నా కోరికను చెప్పడం జరిగింది. నా ఇండియా ప్రయాణానికి వీలు దొరకక .... ఎప్పటికో.... ఓ ఏడాదికి కుదిరింది, వెళ్ళేదాకా రావుగారు, నా సందేహాలు...ప్రతి నిత్యం తరుముతూనే ఉన్నాయి.
****
అర్ధరాత్రి రెండిటికి రైలు కోసం ఎదురుచూస్తున్నాను, ప్లాట్ఫారంపై అలవాటులేని బోసితనం, స్టేషన్ చుట్టూతా చిక్కటి నల్లదనం అలుముకుంది, హోరు లేని స్పష్టత ఆదమరచిన కలతని తట్టి లేపింది...
చుట్టూ అగోచరమైన పంజరం.. ఊసల్లోంచి కనపడే, వినపడే నిజాలు వార్తా విశేషాలు మాత్రమే...అసమానతలు కనపడవు, అరుపులు వినపడవు, వినపడినా పట్టించుకోవడం నా పంజరపు నాగరికత కాదు, సమయాన్ని సద్వినియోగపరచడం అసలే కాదు.
అపరాధ భావనలను కెరటాల ఆవలకి నెట్టి, నేను నా పంజరపూసలు లెక్కెడుతూ, అప్పుడప్పుడూ కొత్త రంగులు వేసి ఆనందిస్తాను.....భయపెట్టే వాస్తవానికి, అదేమిటో తెలియని అవిశ్రాంతికి మధ్య నేనో పావుని..... .రైలు కూత వినిపించడంతో ఆలోచనలు తమ చీకటి అరల్లోకి త్వర, త్వరగా సద్దుకున్నాయి.
చుట్టూ అగోచరమైన పంజరం.. ఊసల్లోంచి కనపడే, వినపడే నిజాలు వార్తా విశేషాలు మాత్రమే...అసమానతలు కనపడవు, అరుపులు వినపడవు, వినపడినా పట్టించుకోవడం నా పంజరపు నాగరికత కాదు, సమయాన్ని సద్వినియోగపరచడం అసలే కాదు.
అపరాధ భావనలను కెరటాల ఆవలకి నెట్టి, నేను నా పంజరపూసలు లెక్కెడుతూ, అప్పుడప్పుడూ కొత్త రంగులు వేసి ఆనందిస్తాను.....భయపెట్టే వాస్తవానికి, అదేమిటో తెలియని అవిశ్రాంతికి మధ్య నేనో పావుని..... .రైలు కూత వినిపించడంతో ఆలోచనలు తమ చీకటి అరల్లోకి త్వర, త్వరగా సద్దుకున్నాయి.
తెల్లారుతుండగా రైలు ఎక్కడో ఆగగానే, ఎదురుగా ఉన్న ప్రయాణికుడు విసుగు చూపిస్తూ మాటలు కలిపాడు
"విశాఖని పదేళ్ళుగా చూస్తున్నాను సార్, పొరపాటున.. ఒక్క రోజు కూడా టైంకి వెళ్ళిన పాపాన పోలేదు"
నేను నవ్వుతూ "తెలిసీ ఎందుకు సార్ విసుక్కోవడం?"
"అవుననుకోండి, ఈ రోజు చాలా తొందరలో ఉన్నాను, ప్రతీ నిముషం లెక్క పెట్టుకునే పరిస్థితి, అందుకే ఈ సణుగుడు"
"ఏమీ అనుకోకపోతే కారణం తెలుసుకోవచ్చా?"
"నేను ఆంధ్రాబ్యాంక్ చీపురుపల్లి బ్రాంచ్ మేనేజర్ని వారం క్రితం ట్రాన్స్ఫరయ్యింది...సామాన్లు లోడ్ చేసి ఫ్యామిలీతో సహా ఈ సాయంత్రమే బయలుదేరి వెళ్లిపోవాలి"
"అయితే చాలా టైట్గా ఉంది సార్ మీ ప్లానింగ్"
"అవునండి, మీరెక్కడి దాకా?"
"నేనూ చీపురుపల్లే వెళుతున్నాను, అక్కడ పీడీకే రావుగార్ని కలవాలి"
"గురువుగారి దగ్గరికా..,ఆయన మీకు ముందే పరిచయమా?"
"లేదండి, పేపర్లో ఓ ఆర్టికల్ చదివాను, చదివాకా కలవాలనిపించి...."
"వారి సంస్థ మా కస్టమరే, అలాంటి వారిని ఎక్కడా చూడలేదు, హి ఇస్ ఏ గ్రేట్ మాన్"
ఎదురుగా కూర్చున్న వ్యక్తి తాను రిటైర్డ్ హెడ్ మాస్టరని పరిచయం చేసుకుని సంభాషణలో పాలు పంచుకున్నారు
"వారు నాకు ఇరవయ్యేళ్ళుగా పరిచయం, ఈ మధ్యనే రిసర్వ్ బ్యాంకు సెంట్రల్ రూరల్ డెవలప్మెంట్ పానెల్లోకి తీసుకున్నారు, మీలాగే ఆయన్ని కలవడానికి పెద్ద, పెద్ద అధికారులు వస్తుంటారు, ‘ఇట్ విల్ బి ఏ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ ఫర్ యు"
****
శోధన ఆఫీసు గోడలపై రమణ మహర్షి, వివేకానందుడు, నోమ్ చోమ్‌స్కీల సందేశాలు చిన్న బానేర్లపై అతికించబడ్డాయి, వాటిలో అమితంగా ఆకట్టుకున్నది 'తక్కువతో ఎక్కువ సాధించు' అనే విలువైన సూచన.
షెల్ఫ్ నిండా ఎన్నో ఆసక్తికరమైన పుస్తకాలు, గ్రంధాలు వరుసలో ఉన్నాయి, నా స్థాయికి తగ్గట్టుగా పేర్లు చదివి పొంగిపోతుంటే, అప్పుడే లోపలకొచ్చిన రావుగారు పలుకరించారు, నా కుటుంబ నేపధ్యం, అమెరికా ఉద్యోగాల్లాంటి మాటల్లో ఉండగా ఆఫీసులోకి ప్రవేశించన వ్యక్తిని పరిచయం చేసారు
"మా సంస్థ నిర్వహించే బాలబడులని కాసమయ్య చూసుకుంటారు, మీరు వచ్చిన రోజు చాలా మంచి రోజు, మా బడి పిల్లల స్వాతంత్రదినోత్సవ సందడి, మా ఊరు చూసి రండి" అని సాగనంపారు.
ఆ మాట్లాడిన సమయంలో రావుగారు మితబాషని, ఆయన సమక్షంలో సమస్యలు కూడా తలవంచుకునే మృదుత్వం ఆయన నైజమని అర్ధమయ్యింది
****
కాసమయ్యతో కలిసి ఊరి ఎత్తు, పల్లాల్లో నడుస్తూ మాటల్లో పడ్డాను, అతను అడిగిన దానికి సమాధానం చెప్తున్నా నాకిదంతా నమ్మశక్యంగా లేదు, ఎక్కడో తెలియని చోట, తెలియని వారి మధ్య నా ఆనవాళ్ళు వెతుకుతున్న భావం.
"మాదొకప్పుడు అస్తవ్యస్తమైన ప్రాంతం, అప్పుల పాలై పొలాలు అమ్ముకున్న రైతులు, పూట గడవని రోజు కూలీలు, బాల కార్మికులు ఇక్కడి రోజూవారి నిజాలు, మా వెర్రి జనాలకి ప్రభుత్వం వెనకపడ్డ ప్రాంతానికిచ్చే రాయితీలేమిటో, పధకాలేమిటో, ఈ దేశ పౌరుడిగా కనీస హక్కులేమిటనే అనే జ్ఞానం లేక చాలా దుర్భర స్థితిలో బతికేవాళ్ళు, అలాంటి మా ప్రాంతానికి గురువుగారొచ్చి ఆత్మలా కలిసిపోయారు"
“రావుగారికి మీ ఊరితో ఏమైనా సంబంధముందా?"
"మన మధ్య నేల, నీరు, ఆకాశం లాంటి బంధాలుండగా, వేరే చుట్టరికం అవసరమా సార్"
"నా మాటని తప్పుగా అనుకోకండి, ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారని అడిగానంతే"
"గురువుగారు న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా అమెరికాలో పని చేసేవారు, మాతృదేశానికి తన అవసరం ఎక్కువుందని మంచి కెరీర్, హోదా వదిలి ఇక్కడకొచ్చారు"
"మరి వారి కుటుంబం... "
"కుటుంబం స్వార్థ చింతన కలిగించి, ఆదర్శాలకు అవరోధం అవుతుందని బ్రహ్మచారిగా ఉండిపోయారు”
****
శుభ్రమైన ఆవరణలో పెద్ద పాక, పూల మొక్కలు, ఆట స్థలం పొందికగా అమర్చినట్టున్నాయి... లేత మొగ్గలను చూడగానే, చిరునవ్వులు వినగానే అది బాలబడని తెలిసింది.
"ఇది మా చాకలిపేట బాలబడి, ఏ బాదర బందీ, బస్తాలు మోసే అవసరం లేకుండా ఆటా, పాటలతో చదువు నేర్పడం ఇక్కడి సిద్ధాంతం” కాసమయ్య బాలబడిని పరిచయం చేసారు.
ఆ తర్వాత బాలబడి బుడతలని “పిల్లలూ!! కొత్త మాస్టారొచ్చారు మీరు నేర్చుకున్నవి చెప్పండి” అనగానే పోటీ పడి పిల్లలు పద్యాలు, పొదుపు కధలు, శ్లోకాలు వరుసలో నిలబడి ఉత్సాహంగా చెప్తుంటే, వారిలో చదువుని ఇష్టపడే స్వేచ్చ, వారి పక్కనే నిలబడి ప్రోత్సహిస్తున్న టీచర్ల వాత్సల్యం ఊరటగా అనిపించాయి.
అందరి దగ్గర సెలవు తీసుకుని బయటపడి మాటల్లో పడ్డాము
“గురువుగారు రూపుదిద్దిన ఈ ఆదర్శ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 18 జిల్లాలలో అమలుపరిచింది, అమలు చెయ్యడానికి ఏటా సుమారు డెబ్బై వేల రూపాయల ఖర్చవుతుంది”
“ఒక ప్రీ-స్కూల్ విద్యార్థికి ఏభై వేల నుండి లక్ష రూపాయల దాకా ఫీసుతో ఏ మాత్రం పోలిక లేదు”
"వీరి తల్లి, తండ్రులు రోజు కూలీలు, తమ కుటుంబ స్థితి మెరుగుపర్చుకోవాలంటే పిల్లలకి చదువు చెప్పించడం చాలా అవసరమని ఇక్కడకి పిల్లల్ని ఇష్టంగా పంపుతారు, తమ శక్తికి తగ్గ సహాయ, సహకారాలని అందిస్తారు, ఇలా మా ఊరే కాదు చుట్టూ ఉన్న నలభై, ఏభై గ్రామాలలో గురువుగారు భాగస్వామ్య చైతన్యం తీసుకొచ్చారు"
“రావుగారు చాలా మృదుబాషిలా కనిపించారు, మరి ఇంత మార్పునెలా సాధించారు”
"ఆ మృదుత్వం వెనుక పరిస్థితులను మార్చాలన్న ఉక్కులాంటి సంకల్పముంది- అసమానతలని సమాధి చెయ్యాలని...చిన్నపిల్లల చిరునవ్వులు చూడాలని.... ఇది ఒక్క రోజు మార్పు కాదు, ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం, ఎంతో సహనం, ఎన్నో ఒడిదుడుకులు... ఇరవై ఎనిమిది సార్లు తప్పుడు కేసులు పెట్టి, పోలీసు ఎంక్వయిరీలు వేసారు, ప్రతీ సారి కేసు కొట్టేయాల్సి వచ్చింది”
“మీరు చాలా ఏళ్ళుగా సంస్థలో పనిచేస్తున్నారా?”
“ఇది నాకు పని కాదండి, పదో తరగతి ఫైలయ్యి ఏదో ఒక పని చూసుకుందాం అనుకున్న సమయంలో గురువుగారు పరిచయమయ్యారు, నిన్ను నేను చదివిస్తాను, రోజూ ఓ గంట పిల్లలకి పాఠాలు చెప్పాలి అన్నారు, అలా యెమ్.ఏ పూర్తి చేసాను.. పాఠాలు చెబ్తూనే ఉన్నాను, ఇంచుమించు మా శోధన కుటుంబ సభ్యులందరిదీ ఇదే నేపద్యం”
కాసమయ్య కాస్త దూరం నడిచాకా రోడ్డు పక్కగా ఉన్న రిక్షావారి కాలనీ చూపించాడు "గురువుగారు రిక్షా కార్మికులతో కలిసి ఏడేళ్ళ పాటు శాంతియుతంగా పోరాడి సాధించిన నేల, ఏ దళారీ లేకుండా సొంతంగా కట్టుకున్న ఇళ్ళు”
అడుగడుకీ శోధన సాధించిన ప్రజా విజయాలు కాసమయ్య చెప్తూనే ఉన్నాడు, చూపిస్తూనే ఉన్నాడు.
నా పంజరానికి, పట్టుదల పునాదులపై, సహనపు ఇటుకలు పేర్చి కట్టిన దృఢమైన కట్టడాలకి ఏ మాత్రం పోలిక కనపడలేదు..రావుగారు కూడబెట్టిన, కొల్లగొట్టలేని స్థిరాస్థులు.... ఆయన చుట్టూ ఉన్న వారిలో రేపటిపై గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసం అనిపించింది.
*****
రావుగారు స్వయంగా వంట చేసుకుంటారని ఆయన చేతి పులిహోర తింటున్నపుడు తెలిసింది, డెబ్బై మూడేళ్ళ ఏళ్ళ వయసులో అన్ని పనులు సొంతంగా చేసుకుంటారని, రూరల్ డెవలప్మెంట్ సమావేశాలకి పెద్ద నగరాలకి, బాలబడి పర్యవేక్షణకి ఏజెన్సీ ప్రాంతాలకి వెళ్ళే అలుపెరుగని శ్రామికుని పాదాలకి నమస్కరించి, చెమ్మగిల్లిన కళ్ళతో నా సందేహాలు అడిగాను "మీరు కలిగించిన చైతన్యాన్ని చూసాకా ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను, మీరు అంత తేలిగ్గా అన్నీ ఎలా వదిలేసారో, ఓ చట్రంలో బతికే నాకు ఎన్ని సార్లు ఆలోచించినా అర్ధం కాలేదు"
"మధు గారు, నేను త్యాగం చేసాననుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకి వేసేవాడిని కాదు, ఇది నేను ప్రేమతో ఎంచుకున్న మార్గం. ప్రగతి పేరుతో మనం కొన్ని వర్గాలని వనరుల్లా ఉపయోగించుకుని, దూరంగా పెడుతున్నాము. మనం వాడే ప్రతి వస్తువు వెనక ఎన్నో చాలీ చాలని జీవితాలు, కన్నీళ్లు ఉంటాయి, వాటిని సరిదిద్దే భాధ్యత మనది.... అందులోనే నిజమైన దేశ ప్రగతని నా నమ్మకం"
"తప్పుగా అనుకోకండి మేధావులు వెనకుండి మార్పుని నిర్దేశిస్తారు కదా... మీరు ఇలా... ?"
"మన దేశానికి మేధావుల సలహాలు, ధనవంతుల చందాలు సరిపోవు, కావాల్సింది క్షేత్రస్థాయిలో గడపగలిగే నిబద్ధత, అలా గడిపితే కానీ ప్రజలు, వారి సమస్యల లోతు అర్ధంకావు, ఎంత గొప్పవారయినా అంతరీకరణ చేసుకుంటే తప్ప తమ ఆలోచనలని ఉపయోగపడేలా చెయ్యలేరు”
“హక్కుల పోరాటంలో మీకు బెదిరింపులు వచ్చేవని విన్నాను, మీకు భయం కలుగలేదా?”
“బెదిరింపులు వస్తూ ఉండేవి, నేను చాలా మొండివాడినని మా అమ్మ అంటూ ఉండేది, అప్పుడు అర్థమయ్యేది కాదు (ఆ మాటన్నపుడు చిన్న పిల్లవాడిలా అనిపించారు), నాకెప్పుడు ప్రజల మద్దతు ఉండేది, శాంతియుతంగా, న్యాయబద్ధమైన రీతిలో మా పోరాటం సాగేది...అందుకే ఓ కొలిక్కి రాడానికి అంతంత సమయం పట్టేది”
రావుగారు చెప్పింది తేలికగా అనిపించినా మౌలిక అంశాలపై అధికారంతో తలపడాలంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎంతో తెగువ, సత్తువ, ఆత్మబలం కావాలి, అది అతి కొందరికే సాధ్యమని నాకు తెలుసు. మరెన్నో సందేహాలకి వారి ఫిలసాఫికాల్ కాంనెస్లో జవాబులు దొరికాయి.
కొత్త స్నేహితులకి, రావుగారికి వీడ్కోలు చెప్పి స్టేషన్కి బయలుదేరాను, అరుదైన అదృష్టాన్ని ప్రత్యక్షంగా కలిసిన ఆనందం, ప్రపంచాన్ని అసంతృప్తితో చూడకు, పాజిటివ్నెస్ మనతోనే మొదలవుతుంది, వాటిని చేతలుగా మార్చడం మనతోనే మొదలవుతుందనే బాధ్యత కలగలిపి నడుస్తున్నాను... నా ప్రయాణానికి ఇది ఆరంభమని, స్టేషన్లతో ఆగిపోయేది కాదని గట్టిగా అనిపించింది....దానికి తాతయ్య మాష్టారు కారణం.
*****